పుట:Chandragupta-Chakravarti.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

చంద్రగుప్త చక్రవర్తి


ప్రద్యోతునకు రాజ్యము నిచ్చెను. ఈ వంశమువా రైదుగురు రాజ్యము నేలిరి. చివరవాఁడగు నందివర్ధనుని జంపి యాతని మంత్రియైన శిశునాగుఁడు రాజయ్యెను. ఈ వంశమునకు శిశునాగవంశ మని పేరు. శిశునాగుఁడు, కాకవర్ణుఁడు, క్షేమధర్ముఁడు, క్షత్త్రౌజుఁడు, బింబిసారుఁడు, అజాతశత్రువు, దర్శకుఁడు, ఉదయనుఁడు, నందివర్ధనుఁడు, మహానంది, అని శైశునాగులు పదుగురు.

శిశునాగు డేడవశతాబ్దమున రాజయ్యెనని చెప్పవచ్చును. ఈ వంశమునం దయిదవవాఁడు బింబిసారుఁడు. ఇతనికి శ్రేణికుడని నామాంతరము. ఇతడు క్రీ. పూ. 528 వ సంవత్సర ప్రాంతమున అంగరాష్ట్రము నాక్రమించి వశపఱచు కొనెను. ఇతడు కోసలరాజు కూతుఁను లిచ్చవివంశ కన్యను వివాహమాడెను. ఈరాజు రాజ్యము చేయుచుండఁగనే గౌతమబుద్ధుఁడును, మహావీరుఁడును దమతమ క్రొత్తసిద్ధాంతములను మాగధులకు బోధజేసి నూతన మతాభివృద్ధి చేసిరి. జైన మతాచార్యుఁడగు మహావీరుఁడు బింబిసారుని రెండవ భార్యకు దగ్గరి చుట్టము. గౌతమ బుద్ధుఁడు తన జీవితములో చాలకాల మితని రాజ్యములోనే నివసించి యుండెను. రాజ్యము విడిచి సన్న్యాసి యయి బయలుదేరిన తరువాత బుద్ధుఁడు ప్రప్రధమమున రాజగృహమునందే గురువులయొద్ద తత్త్వవిచారము నేర్చుకొనెను. అతఁడు బుద్ధత్వము చెందిన బుద్ధగయ మగధ దేశములోనిదే.