పుట:Chandragupta-Chakravarti.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

చంద్రగుప్త చక్రవర్తి

5. స్థానపాలకుఁడు - అశ్వశాలలను సంరక్షించువాఁడు

6. కేశ కారుఁడు- వెండ్రుకలు కత్తిరించి గుఱ్ఱములకు నునుపు పెట్టువాఁడు

7. జాంగలికుఁడు - ఆహారాదులఁ బరీక్షించువాఁడు


గజములు

మనదేశమున ప్రాచీన కాలమునందు సైన్యములోని యంగములలో గంజాంగ మెక్కువ యుపయోగకారియై కన్పట్టు చున్నది. చంద్రగుప్తుని కాలమునఁ బ్రతి గజముపై మావటివాఁడు గాక ముగ్గురు యుద్ధభటు లెక్కుచుండిరి. వారు మువ్వురును ధనుర్ధరులు. ఇద్దఱు ప్రక్కలనుండియు మూఁడవవాఁడు వెనుకనుండియు బాణముల వేయుచుండిరి.1[1] ఆ కాలమున గజసైన్యము యుద్ధ సమయములఁ జేయుచుండిన పను లెవ్వియనిన :--

సర్వసేనాముఖంబున నడచుట, సైన్యము నడచుటకు మార్గములను శిబిరస్థానములను నీరు దెచ్చుటకు త్రోవలను సిద్ధపఱచుట, సైన్యము చుట్టును నావరించి రక్షించుట, అంగేతరంబులు చలించినను చలింపక యెదురొడ్డి నిలుచుట, ప్రవాహంబు లడ్డము వచ్చినప్పుడు సైన్యములను దాఁటించుట, అభేద్యస్థలంబులను బలంబున భేదించుట, శత్రుసైన్యంబులకు నగ్ని ముట్టించి స్వసైన్యంబున గలిగిన యగ్నిబాధల నివారించుట, చెదరిన సైన్యంబును నొక్కెడ ప్రోగుచేయుట, వైరుల గట్టి మొనలను చెల్లాచెదరొనర్చుట, రిపువర్గమును హుంకరించి

  1. 1 మెగస్తనీసు