పుట:Chandragupta-Chakravarti.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ ప్రకరణము

79


దార్లు చేతిపనులమీఁది యధికారులు. వారు వర్తకు లమ్మిన సరకులమీఁదఁ బన్నులు పోగుచేయువారు. ఈ విడివిడి పనులు గాక వీరందఱును గ్రామములలోని యితర వ్యవహారములన్నిటిని జూచుచు, గుళ్లు, రేవులు, అంగళ్లు, మొదలైనవానిని గాపాడు చుండిరి. ఇది పాటలీపుత్ర రక్షణ విధము. ఇటులే యితర పురంబులన్నియు రక్షింపఁబడుచుండెను.

ఒక మహోత్సవము

పాటలిపుత్రమున వీథులయందు డంబుగ జరిపింపఁబడిన యొక దివ్య మహోత్సవమును మెగాస్తనీసు దర్శించి తెలిపిన దానిని స్ద్రాబో దిగువరీతిని వర్ణించినాఁడు.

"వారి పండువుల యూరేగింపులయందు స్వర్ణ రజతాలంకృతములగు అనేక యేనుఁగులు ఒయ్యారముగ నడచి వచ్చును. నాలుగు గుఱ్ఱములచేతను, ఎద్దులజతలచేతను లాఁగఁబడిన "లెక్కలేని బండ్లును వెంబడించును. వెను వెంటఁ రిబచర సమూహములు నిండుదుస్తు తొడిగి బంగారు పాత్రలను, పెద్ద పళ్ళెరములను వెడల్పు గిన్నెలను, మేజాయిలు, విలువగల కుర్చీలు, పచ్చలు, మరకతములు, గరుడపచ్చలు, కెంపులు మున్నగు రత్నములు చెక్కిన రాగిగిన్నెలు, మొదలగునవి మోసికొని వచ్చుచుందురు. బంగారు నగిషీపని చేసిన ఉత్తమ వస్త్రములు మోచువారు కొందఱుందురు. వారి వెనుక అడవి దున్నలు, చిరుతలు, పెంపుడు సింగములు, పలురంగుల రెక్కలుగల నానాజాతుల పక్షులును, పిట్టలును గొనిరాఁబడు చుండెను."