పుట:Chandragupta-Chakravarti.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

చంద్రగుప్త చక్రవర్తి


తెలిసికొనుటకు ఈ రాయబారియొక్క వ్రాతలే ముఖ్యాధారములు. ఆ వ్రాతల ననుసరించియే యీ క్రింది వర్ణనలు వ్రాయఁబడు చున్నవి.

పురవర్ణన

మగధదేశ రాజధానియగు పాటలిపురము గంగాశోణా నదుల సంగమమువలనఁ గలిగిన యంతర్వేదిలో శోణకు నుత్తరమునను, గంగకు దక్షిణమునను ఉండెను. ఇప్పురి రమారమి తొమ్మిది పదిమైళ్ల నిడివియు, రెండుమైళ్ల వెడల్పును గలిగి చతుర్భుజాకారముగ నిర్మింపఁబడియె. అనఁగా నిది యిరువది చదరపు మైళ్లు వైశాల్యముగల నగరము. అత్యంత ఘనమైన కాష్ఠ ప్రాకారముచే నావరింపఁబడి యఱువదినాల్గు ద్వారములును ఏనూటడెబ్బది బురుజులును గలిగి, శోణాది నీళ్ళతో నింపఁబడిన మిగుల వెడల్పును లోతునుగల యగడ్త చే రక్షింపఁ బడియుండెను. పట్టణము చుట్టునున్న యీ కందక మాఱు వందల యడుగుల వెడల్పును, ముప్పది మూరల లోతును ఉండెనఁట. ఈ గ్రామముచుట్టు డెబ్బదియైదు గజములకు నొక బురుజును, ఆరువందల యఱువది గజములకు నొక కోటగుమ్మమును ఉండెను. ఇరువది చదరపు మైళ్ల వైశాల్యమును ఇరువదినాల్గు మైళ్లు చుట్టుకొలతయుఁగల యా నగరరాజము కలకత్తాకు సమముగ నున్నట్లు లెక్కింపనచ్చును,

రాజమందిరము.

శోణానది యొడ్డున నానావిధ వృక్షజాతులచే శోభితంబగు నుద్యానవనము కలదు. అందు రాజమందిరముండెను. .