పుట:Chandragupta-Chakravarti.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ ప్రకరణము

59

మెగాస్ రాజు 258 వ సంవత్సరమున మృతుఁడయ్యెను. అలెగ్జాండరు గూడ ఆ సంవత్సరముననో లేక యంతకు గొంచెము కాలము పూర్వముననో పరలోక గతుఁడయ్యెను. కావున పైని పేర్కొనఁబడిన అశోకశాసనము మెగాస్ బ్రతికి యుండగనో లేక మృతిఁజెందిన సమాచారము తెలియక పూర్వమో చెక్కింపఁబడి యుండును. సైరస్ నుండి మెగాస్ మృతిఁజెందిన వర్తమానము హిందూదేశమునకు వచ్చుటకు నొక సంవత్సరము కంటే నెక్కుడుకాలము పట్టదనుట నిశ్చయము. కావున 257 వ సంవత్సరముకంటెఁ దరువాతి కాలమున నీ శాసనము చెక్కింపఁ బడలేదని మనము నిశ్చయింపవచ్చును. ఈ శాసనము అశోకుని పట్టాభిషేకమయిన తరువాత పదమూఁడవ యేట చెక్కింపఁ బడియెను. అనఁగాఁ బట్టాభిషేకమై పండ్రెండు సంవత్సరములు గతించెనని యర్ధము. 257 తో 12 కలుపగా 269 వ సంఖ్య సిద్ధించుచున్నది. కావున క్రీ. పూ. 269 వ సంవత్సరమున అశోక మహారాజు పట్టాభిషిక్తుడయ్యె నని తేలుచున్నది. సింహళద్వీప చరిత్రములఁజూడ కొన్ని గృహ కలహములచే నశోకుఁడు రాజ్యమునకు వచ్చిన తరువాత మూఁడు సంవత్సరములకు నతని పట్టాభిషేకము జరిగెనని తెలియుచున్నది. కనుక నాతనికి 269 లోఁ బట్టాభిషేకము జరిగినను ఆతఁడంతకు మూఁడు సంవత్సరముల ముందే అనఁగా క్రీ. పూ. 272 లో రాజ్యమునకు వచ్చినట్టు గ్రహింపవచ్చును.

అశోకుని తండ్రి బిందుసారుఁడు. ఆతఁడిరువది యైదు సంవత్సరములు రాజ్యముఁ జేసెనని పురాణములు చెప్పు