పుట:Chandragupta-Chakravarti.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ ప్రకరణము

చంద్రగుప్త కాలనిర్ణయము

హిందూ దేశమునకుఁ బ్రథమ చక్రవర్తియైన చంద్రగుప్తుని కాలమెట్లు నిర్ణయింపఁబడినదని చదువరు లడుగవచ్చును. వారి జిజ్ఞాస తృప్తిపఱుచుటకై యిచ్చట నీ విషయము చర్చింప వలసియున్నది. ఇదియుఁగాక చంద్రగుప్త కాలనిర్ణయము హిందూదేశ చరిత్రాధ్యయనముఁ జేయగోరు విద్యార్థులు గమనింపవలసిన ముఖ్యవిషయములలో నొక్కటి. హిందూదేశము యొక్క సాద్యంత చరిత్రము నేటి వరకు హిందూ మహాయుగము, మహామ్మదీయ మహాయుగము బ్రిటిషు ప్రభుత్వము అని త్రిప్రకరణాత్మకముగా వర్ణింపఁబడు చున్నది. ఇందు రెండవ మూఁడవ ప్రకరణములలోని కాల నిర్ణయములు నిశ్చితములు. వానిని గుఱించి విశేష భిన్నాభిప్రాయము లుండవు. గజినీమహమూదు సోమనాథ దేవాలయమును దోఁచుకొనిన సంవత్సరమును, అగ్బరు చక్రవర్తి రాజ్యమునకు వచ్చిన తేదియు, లార్‌డుకారన్ వాలిసు రాజప్రతినిథిగా హిందూదేశమునకు వచ్చిన యేడును మనము నిశ్చయముగా నెఱుఁగుదుము. ఇందుకు కారణము ఆయా కాలముల