పుట:Chandragupta-Chakravarti.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

చంద్రగుప్త చక్రవర్తి


సంధిచేసికొను కాలమువఱకును చంద్రగుప్తుడు ఉత్తరమున ఆఫ్‌గనిస్థానము బెలూచిస్థానముల వఱకును, పూర్వమునను పశ్చిమమునను సముద్రము వఱకును గల రాజ్యమును జయించి యేకచ్ఛత్రాధిపత్యముతో నేలి హిందూదేశముయొక్క మొదటి చక్రవర్తియనిన బిరుదును సంపాదించుకొనెను,

మైసూరు గెజటీయరు లేఖకుఁడగు రైసుగారినుడువున, శికర్పూరు తాలూకా బందనిక్కె గ్రామపు శిలాశాసనము (12-వ శతాబ్దములో ) కుంతలదేశమును మౌర్యుల మాగాణముగా వర్ణించు చున్నది. ఇయ్యది భీమావేదవతులకు నడుమ సహ్యాద్రులవఱకును శివమొగ్గ, చిత్రదుర్గము బళ్లారి, ధార్వాడ బీజాపురము, బొంబాయి, హైదరాబాదు సీమల భాగములను వ్యాపించిన దేశమనియు తెలిసెడిని. ఈదక్షిణదేశమును జయించినవాఁడు చంద్రగుప్తుఁడో లేక ఇతని కొడుకగు బిందుసారుఁడో తెలియకున్నది. మైసూరు సీమలోనే శ్రవణ బెళగొళమునందలి శిలాశాసనము చొప్పున చంద్రగుప్తుఁడు అచ్చట జైనమతావలంబకుఁడై మరణమొందినట్లుగాన బడియెడి. కాని ఇది యింకను చింత్యము.

పదునాఱు సంవత్సరములలో నింత విశాల రాజ్యమును నిర్మించి, దానిని మిక్కిలి జాగ్రత్తతోఁ గాపాడిన ఈ రాజును భూమండలములో శూరాగ్రేసరులని ఘనతవహించిన ఫిలిప్పు అలెగ్జాండరు, హ్యానిబలు, నెపోలియను మొదలయిన మహాసేనానాయకులలో నొక్కనిఁగా నెంచవలెనని యుకానొక పాశ్చాత్యుఁడు వ్రాసియున్నాఁడు.