పుట:Chandragupta-Chakravarti.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముందు మాట

ఈ గ్రంథము మేము తలపెట్టిన హిందూదేశ పాలక చరిత్రమాల (Rullers of India Series) యందు మొదటి సంపుటము. దీనికి విషయము సమకూర్చుటయందు గ్రంథకర్త మిక్కిలి పరిశ్రమ చేయవలసి వచ్చినది. మన ప్రథమచక్రవర్తి చంద్రగుప్తుడు. ఆతనిం గుఱించి మొట్ట మొదట వ్రాయ నుపక్రమించితిమి. కాని ఇటీవల ప్రతి దినమును అక్కాలమును గూర్చి ఏదో యొక విశేషాంశము బయలు పడుచుండుటవలన సాధ్యమయినంత వఱకు ప్రాచీన నవీనాంశముల సమన్వయము చేయుట ధర్మమని యెంచి ఇంతకాలాతి క్రమంబునకు నోర్వవలసి వచ్చినది.

ఆంధ్రమున వ్రాయఁబడిన చరిత్ర గ్రంథములలో నిదివఱకు నవలంబింపఁబడని నవీనపద్ధతు లిందు నవలంబింపఁబడినవి. చంద్రగుప్త కాలనిర్ణయము ఆంగ్లేయ చరిత్రకారులలో నగ్రగణ్యుల నందగువారి ఫక్కి ననుసరించి చేయఁబడినది. గ్రంథాంతమున "చంద్రగుప్తుని సమకాలీనులు" అను ప్రకరణమున స్వదేశీయులును పరదేశీయులును నగుఁ గొందఱు మహాపురుషుల జీవితములు వర్ణింపఁబడినవి. ప్రసిద్ధ పాశ్చాత్య చరిత్రకారులచే రచింపఁబడిన "జీవితచరిత్రముల" సారమిం దిమిడ్చినందులకు గ్రంథకారు లభివందనీయులు.

ఇయ్యది చిన్న సంపుటమే యైనను నిద్దానిని జాతీయాభిమానముతోఁ జదువునట్టివా రెల్లరకును దీని యుపయోగము గొప్పది యని తోఁపక మానదు.

సంపాదకుఁడు

కె. వి. లక్ష్మణరావు M. A.