పుట:Chandragupta-Chakravarti.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

చంద్రగుప్త చక్రవర్తి


అలెగ్జాండరునకు పూర్వము భరతవర్షమును గుఱించి పశ్చిమ ఖండవాసులకు నిర్ణీతజ్ఞానము లేక యక్షరక్షాది లోకములవలె పుక్కిటి పురాణములకు విషయమై యుండెను. లోక మంతటిని జయింప నాసక్తుఁడై వచ్చిన అలెగ్జాండరు అక్కాలమందు గ్రీకులకు ఋషిస్థానముననున్న అరిస్టాటిలుని శిక్షయం దుంపఁబడి విద్యావినీతుఁడై పెరిగినందున, దానాక్రమింపఁగల సమస్త దేశముల చరిత్రభూగోళాది వివరములఁ జక్కగవ్రాయ గలయట్టి గ్రీకువిద్వాంసులను తోడ్కొని వచ్చెను. అట్టి పలంపరా ప్రాప్తబుద్దితో మెగాస్తనీసు తానున్నంత కాలము విన్నవియు కన్నవియు నౌ విషయముల దినచర్యగ వ్రాసికొని పోయెను.

అ దినచర్యలో పాటలీపుత్ర నిర్మాణాది వివరములును, చంద్రగుప్త రాజ్యభారాది వివరములును, ఆ కాలమున నతడు అవలోకింపగల్గిన మతవర్ణాశ్రమాచార వ్యవహారాది వివరములును, దక్షిణ హిందూస్థానము మున్నగు తాను గనని ప్రదేశములను గుఱించి దా వినినయట్టి వివరములును, వంచన లేక లిఖించియున్నాడు.

ఆతఁడు పాటలీయందున్న రెండు వత్సరముల లోపలనే ఎంతయో వ్రాసి స్వదేశమునకు పుస్తక రూపముగ జ్ఞానమును కొనిపోయెను, అందలివర్తమానములను గ్రీసు ఇటలీ దేశస్ధులగు చరిత్రకారులు తమ తమ చరిత్రములలో నెక్కించుకొని. సరితప్పులను తమ చిత్తమువచ్చినట్లు విమర్శనములలో కలిపి వ్రాసియుంచిరి.