పుట:Chandragupta-Chakravarti.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము

167


మెగాస్తనీసు

మెగాస్తనీసును గుఱించి మనకు విశేషము తెలియదు. ఇతని గ్రంథమును లేదు. ఇతని తరువాతి గ్రీకు గ్రంథకారు లీతనివని కొన్ని కొన్ని వాక్యములు అనువాదించి యుండుటం బట్టి లోకమున కితని చరిత్ర తెలియకున్నను ఇతర విషయముల చరిత్ర పరిస్ఫుటముగఁ దెయవచ్చుటకు వీలు కలిగి యున్నది.

కొందఱు మెగాస్తనీసు పారసీకుఁ డనియు నలెగ్జాండరు వెంట వచ్చినవాఁ డనియు ననుచున్నారు. కాని యవి వట్టి యూహలు,

ఇతఁడు క్రీ. పూ. 302 లో సెల్యూకసుచే చంద్రగుప్తుని యాస్థానమున రాయబారిగ ననుపఁబడెను. ఇతఁడు పంజాబులలోని నదులను బేర్కొనుటచే నామార్గముగఁ బాటలీపు త్రముం జొచ్చినట్లూహింపఁ దగియున్నది. ఆ పట్టణమున నితఁడు బహుకాలము నివసించెను. దానికి బూర్వ భాగమందుండు భరతవర్షమును ఇతఁడు సమక్షముగఁ జూచి యుండలేదు. కొంద ఱీతఁడు చంద్రగుప్తుని తోడంగూడ దేశమును జుట్టుచుండె నందురుగాని దాని కాధారము గానము, ముఖ్యముగ బ్రాహ్మణులనుండి విని సర్వమును నితఁడు వర్ణించి యున్నాఁడు. దేశభాషలు చక్కఁగఁ దెలియమింజేసి వినుట యొక్కటి యర్థము చేసికొనుట మఱియొక్కటియయి. ఈతఁడొక కొన్ని యద్భుతముల వ్రాసె ననుటకు సందియములేదు.