పుట:Chandragupta-Chakravarti.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

చంద్రగుప్త చక్రవర్తి


నకుఁ దోలుకొని పోవుచుండెను. మార్గమధ్యమున నా మోయు పశువు పడిపోయెను. అంతట నాసేవకుఁడు ద్రవ్యపుమూటలను వీపునవేసికొని మోయలేక మోసికొని పోవుచుండెను. అప్పుడు వానిని అలకసుందరుఁడు చూచుట తటస్థించెను. వెంటనే సంగతులు తెలసికొని అలెగ్జాండరు "మిత్రమా! నిలువుము. ముందునకు సాగిపోవలదు. అది నీ సొమ్ము. నీయింటికిఁ గొనిపోయి నీవే యుపయోగించుకొనుము" అని నియోగించెను. ఆహా ! ఒక్క నిమిషంబున దారిద్ర్యమునుండి లేవఁదీసి మహైశ్వర్యవంతునిగఁ జేసిన అలెగ్జాండరునెడ నా దరిద్రుఁ డెంత భక్తివిశ్వాసములు గలవాఁడయ్యెనో మనమెఱుంగఁ గలమా? అలెగ్జాండరింతటి యుదారవంతుఁ డనియైన మన మిప్పుడు లెక్క వేయఁగలమా?

ఒక సందర్భమున నలెగ్జాండరు సైన్యము మిక్కిలి విరివియగు నిర్జలప్రదేశముగుండ ప్రయాణము సలుపవలసి వచ్చెను. కొందఱు మెకడోనియనులు మాత్రము ఒక ఏటికడ బుడ్లలో నీరు నించుకొని తమ వాహనములపైఁ దెచ్చుకొనుచుండిరి. అలెగ్జాండరునకు విశేషము దప్పిపుట్టెను. అప్పుడు వారిలో కొందఱు శిరస్త్రాణంబున నొక్కట నీరునించి అతని కిచ్చిరి. అతఁడు దానిని బుచ్చుకొని ఎవ్వరికిఁగాను గొనివచ్చుచుండిరని యడిగెను. వారు "మా బిడ్డలకొఱకు కొనివచ్చుచున్నారము. మా ప్రభువు జీవించినచో నిప్పటి బిడ్డలు పోయినను మాకు బిడ్డలకుఁ గొదవయుండ" దనిరి. ఈ లోపల నలకసుందరుఁడు చుట్టుఁజూడ సైనికులనేకులు దలలువాంచి అతని చేతిలోని