పుట:Chandragupta-Chakravarti.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

చంద్రగుప్త చక్రవర్తి


వేషధారి బ్రాహ్మణుఁడనుట బొత్తిగ ననాదరణీయము. వారి నిష్ఠ లెల్లయు బౌద్దజైనుల వ్యాప్తిని ఆటంకపఱుచుటకు చాణక్య ప్రభృతులైన బ్రాహ్మణులు పన్నిన కుట్రయని ముద్రా మంజూషమునందు చాణక్య వాఙ్మూలముగ చెప్పఁబడియున్నది. కొందఱు పశ్చిమఖండపు పండితులు నిట్లే యూహించిరి. కాని ఇయ్యది శంకనీయమని టెలాంగుగారి యభిప్రాయము. నాల్గవ శతాబ్దమునందు బౌద్ధనిగ్రహము చేసినట్లు తెలిసెడి గుప్త వంశపు రాజుల చెయిదమును చాణక్యునిపై నారోపించిరేమొ? బౌద్దనిగ్రహకథకు చోటియ్యక మెగా స్తనీసు దినచర్య వారిని గుఱించిన ప్రశంసయే చేయకున్నది. కావున బౌద్ధ జైనుల యాధిక్యతకు అశోకవర్ధనుని కాలమే మొదలని యూహింపవలసి యున్నది. అథవా బౌద్ధులవంటి వారిని నిగ్రహించుటకు వారిని మించిన సుశీలతానుష్ఠానము యుక్త మార్గముకాని కేవల రాజస తామస భూయిష్టమైన రాజ ద్రోహాది కార్యముల వంటిదికాదని జ్ఞప్తి నుంపవలసియున్నది. మనము నిర్ణయింపగలదెల్ల నేమనఁగ, చాణక్యుని యభిప్రాయము స్వధర్మువును రక్షించుకొనవలసినది ; క్షత్రియ కృత్యములలో ఫలసంప్రాప్తికిఁ గావలసిన మార్గ మేదియైనను నీతియుక్తమె యగు. రాక్షసుఁడు చంద్రగుప్త నాశనమునకై చేసిన కూట ప్రయత్నములును అటువంటివిగనే యున్నవి. కావున ఆకాలపు రాజమాత్య కులములవారి యభిప్రాయమున నీతిస్వరూప మమ్మెయిని భావింపఁబడి యుండె ననవలయు. .