పుట:Chandragupta-Chakravarti.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

చంద్రగుప్త చక్రవర్తి

ఈ న్యాయసంఘములకు ననుసరణీయమైన సాధనములు నాల్గు విధములు. మొదటిది ధర్మము. ఇది శాస్త్రచోదితము. వ్యాఖ్యానభేద మున్నపుడే దప్ప ఇది యనుల్లంఘనీయము. రెండవది వ్యవహారము. వ్యాజ్యెదారులు తత్పూర్వము చేసికొనిన యొడంబడికలు మున్నగు నుపకరణములును సాక్షుల సాక్ష్యమును నిం దిమిడియున్నవి. మూఁడవది; చరిత్ర. అనగా ఆచారాదుల ననుసరించి యేర్పడిన తీర్మాన సముదాయము. నాల్గవది రాజ శాసనము. అనఁగా రాజులు పరంపరగ నేర్పఱచుచు వచ్చిన చట్టములు. ఇందు కడపటి మూఁడు సాధనములును వరుస క్రమమున బలవత్తమ బలవత్తర బలవంతములు. అయిన నిందెద్ది యయిన ధర్మ విరుద్ధముగాఁ గాని న్యాయ విరుద్ధముగాఁ గాని ఉండినచో ననుసరణీయము.

సర్వ జనులకును సామాన్యముగఁ దెలిసిన ఈ నాలుగు సాధనములుగాక న్యాయసంమములకు మఱియొక సాధన ముండెడిది. అది వేగులవారి సమూహము. వారు దేశమునందలి ప్రతివిషయమును గనిపెట్టి రాజునకుఁ దెలియఁజేయు చుండుటేకాక యవసరమగు సంగతులను న్యాయ సంఘముల వారికిని తెలిపి న్యాయవిచారణకుఁ దోడ్పడ నేమింపఁబడిరి. కాని వారి వార్తలను మాత్రము న్యాయాధికారులు బహు జూగ్రత్తతోఁ బరీక్షింపుచుండిరి. ఇతరాధారము సంపూర్ణముగ నుండినపుడే తప్ప ఈ సాధన ముపయోగింపుకొనఁ బడు చుండలేదు,