పుట:Chandragupta-Chakravarti.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

111


సామగ్రిని దూతలను పనిచి రాజకీయ కార్యములను జక్కపెట్టుకొనుటకుఁ జక్రవర్తి కీ మార్గము లెంతయుఁ దోడ్పడు చుండెడివి.

ఇట్టి మార్గముల నిరంతరమును బ్రయాణము సలుపు చుండిన వాహనసాధనములను గుఱించి యోచింతము. అందు రథములు మొదటివి. సైన్యమును గుఱించి వ్రాయునప్పుడు రథాథ్యక్షుఁ డొక్కఁడుండెనని వ్రాసితిమిగదా ! దాని వలననే అప్పటి కాలమున రథము లెంత ముఖ్యవాహనము లయినదియు మా చదువరు లూహించు కొనఁగలరు. ఏడుజాతుల రథము లుండెడివి. ఎత్తునందు పదియడుగులు గలవి యున్నత తమములు. అట్లే వెడల్పునందు పండ్రెండడుగుల వఱకుఁ గలవు. దేవరథములనియు, పుష్పరథములనియు, సాంగ్రామికరథములనియు, పారియానిక రథములనియు, 1[1] పరపురాభి యానికము లనియు,2[2] వైనయికములనియు,3[3] రథములలో ఉపయోగము ననుసరించి విభేదము లుండెడివి.

రథములకుఁ దరువాత లఘుయానము, గోలింగము, శకటము నాఁబరగు బండ్లు ముఖ్యసాధనములు ఇవ్వియే సర్వ సాధారణముగ నుపయోగింపఁ బడుచుండెడివి. వీనిని రథములను లాగుటకు ఒంటెలను, ఎడ్లును, గుఱ్ఱములును వాడఁబడు చుండెను. బండ్లు నడపువానికి చక్రచరుఁడని పేరు.

  1. 1. సాధారణ ప్రయాణముల కుపయోగ పడునవి.
  2. 2. పరరాజులపై దండు వెడలునప్పు డుపయోగ వడునవి.
  3. 3. అభ్యాపమున కుపయోగింపఁ బడునవి