పుట:Chandragupta-Chakravarti.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

109


జనాభా లెక్కలు.

నాగరకునకును గోపునకును నియమింపఁబడిన కర్తవ్యములలో జనాభాలెక్క యెప్పటిదప్పుడు వ్రాయుట యొక్కటి మయి యుండెను. తమ గ్రామము నందలి ప్రతివ్యక్తి యొక్క తెగ, జాతి, పేరు, ఇంటి పేరు, వృత్తి, వరుంబడి, వ్యయము, పశుగణములు వీరు లిఖించి పెట్టుచుండిరి. బయటి వారెవరైనను వచ్చినప్పుడు వారిని గుఱించి తెలిసికొని వ్రాసిపెట్ట వలసిన దనియు నట్టివారుగాని మఱియెవ్వరుగాని తప్పు సంగతులు నుడివిన యెడల శిక్షకుఁ బాత్రు లగుదురనియు నున్నది. ఇంతకంటె విశేషమగు జనాభాలెక్క లేల కావలెను ?

బాటలు వాహనములు

చంద్రగుప్తుని రాజ్యము ఇప్పటి భరతఖండమునకంటె విస్తీర్ణమున ఎక్కుడయినదని ఇదివఱకే వ్రాసియున్నాము. ఇంతటి రాజ్యములో నొక్క భాగమునుండి మఱియొక భాగమునకుఁ బ్రయాణాదులు సలుపుటకు సదుపాయములు పుష్కలముగ నుండెను.

పలువిధములగు బాటలు వర్ణింపఁబడినవి. వానివెడల్పు వానివాని యుపయోగములనుబట్టి 32 అడుగులు మొదలు నాలుగడుగుల వఱకు నుండెడివి. ఉపయోగమును బట్టియు గమ్యస్థాన విశేషమును బట్టియు నీ బాటలకుఁ బేరు లమరి యుండెను. రాజమార్గము లనియు, రథపథము లనియు, పశు పథము లనియు, ఖరోష్ట్రపథము లనియు, చక్రపథము లనియు,