పుట:Chandamama 1948 01.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక వూళ్లో ఇద్దరు అన్నదమ్ములు. అన్న చాలా భాగ్యవంతుడు. తమ్ముడు, పాపం అమిత బీదవాడు.

తమ్ముడు ఒకనాడు సంపాదన కోసరం దేశాంతరం బయలుదేరుతూ, దారిలో తినడానికి భార్యను ఏమైనా చేసియివ్వమని అడిగాడు. భార్య ఐదు మినపసున్నిఉండలు చేసి గుడ్డలో మూటకట్టి ఇచ్చింది.

అతను ఆమూట కర్రకు తగిలించుకుని, కర్ర భుజాన పెట్టుకొని బయల్దేరాడు. పోగాపోగా చీకటిపడే సమయానికి ఒక పెద్ద చెరువూ దాని పక్కన వెదురుపొదా కనిపించాయి. ఆచెరువులొ కాసిని నీల్లుతాగి, భుజంమీది మూట వెదురు పొదలొ ఒక గడకు తగిలించి ఆరాత్రికి అక్కడే పడుకుని నిద్రపోయాడు.

కొంత పొద్దెక్కినాకగాని అతనికి మెలకువ రాలేదు. తీరా అతను లేచేసరికి రాత్రి మంచుకు తడిసి వంగి ఉండిన వెదురుగడ ఎండకు పైకి నిలబడి ఉంది. దానితోపాటు అతని మినపసున్ని ఉండల మూటకూడా పైకి వెళ్లింది. మళ్ళీ సాయంకాలమైతేగాని మూట కిందికి రాదని గ్రహించి అతను ఆకలితోటే మళ్ళీ నిద్రపోయాడు.

ఈసమయంలో ఆకాశంలో తిరుగుతున్న ఐదుగురు గంధర్వులకు మినపసున్ని ఉండల వాసన తగిలింది. వెదురు గడకు వేళ్ళాడేమూట చూశారు. దాన్ని విప్పి అందులో ఉన్న ఐదు సున్ని ఉండలూ ఐదుగురూ తిన్నారు. చెరువు గట్టున నిద్రపొయ్యే మనిషిని చూచి అతని బీదస్థితికి జాలిపడి సున్ని ఉండలకు బదులు ఒక చిన్ని పెట్టెను