పుట:Chandamama 1948 01.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్లో ఒక అత్త ఆ అత్తకు ముగ్గురు కోడళ్లు. అ ముగ్గురు కోడళ్ళకు ఒక నిమిషంకూడా పడేదికాదు. ఎప్పుడూ ఎదో ఒక తగువులాట వుండేది. ముఖ్యంగా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నేను వడ్డించాలంటే నేను వడ్డించాలని వత్సందాలు పోయేవాళ్లు. "ఓసి మీ దుంపలుతెగ, గుట్టుగాజరిగిపోయే సంసారాన్ని బజార్లొ పెడతారటే" అని అత్త మందలించేది. అయినా కోడళ్ల తగవులు తెగేవికావు. చివరికి విసిగెత్తి యింట్లోచేయ వలసిన పనిపాటలు అత్త ముగ్గురికీ పంచింది.

భోజనాలప్పుడు పెద్దకోడలు విస్తళ్లు వేసి, మంచినీళ్లు పెట్టాలి. రెండో కోడలు అన్నీ వడ్డించాలి. మూడోకోడలు విస్తళ్ళు తీసి దిబ్బమీద పారెయ్యాలి.

ఈ ఏర్పాట్లతో పనిపాటలు సక్రమంగా సాగిపోతున్నాయి. కోడళ్లు పోట్లాట మానివేశారు. అత్త చాలా సంతోషించింది. ఇక సంసారానికి ఎలాంటి రద్దీ లేదనుకొంది.

ఇలావుండగా ఒకరోజున ఆ ఇంటికి చుట్టాలువచ్చారు. అత్త కోడళ్ళను పిలిచి "ఎవరిపనులు వారు త్వరత్వరగా శుభ్రంగా చేసుకొనిపొండి" అని చెప్పింది. ముగ్గురు కోడళ్లూ సరేనంటే సరేనన్నారు.

చుట్టాలు కాళ్లుకడుక్కొనివచ్చి పీటల మీద కూర్చున్నారు. పెద్దకోడలు త్వరత్వరగా విస్తళ్లువేసి నీళ్ళుపెట్టింది. బంధువులు సంతోషించారు. రెండో కోడలువచ్చి గబగబా చేసిన నాలుగు పిండివంటలూ వడ్డించిపోయింది. అంత తొందరగా వడ్డించినందుకు కూర్చున్నవాళ్ళంతా విస్తుపోయారు. ఇంతలో మూడోకోడలువచ్చి వడ్డించిన విస్తళ్లన్నీ గబగబా ఎత్తివేసి దిబ్బ మీద పారేసింది. కూర్చున్నవాళ్ళు ఒకరిముఖం ఒకరు చూచుకొన్నారు.

అత్త ముఖమింత చేసుకొని, "ఇది ఏమిటర్రా?" అంది.

"ఏమున్నది! నీవు చెప్పినట్లే ఎవరిపని వాళ్లు త్వరగా చేసుకొన్నాము అత్తయ్యా!" అన్నారు ముగ్గురు కోడళ్ళూ ఒక్కసారిగా.

కాళహస్తి బాల, విశాఖపట్నం.