పుట:Chandamama 1948 01.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రచన :: ఏటుకూరి.

(1) గెలముంద నెలముంద కులుకుతూ వచ్చావు
    పలుక రింతా మంటె సంక్రాంతీ: నిలిచి మాటాడవే, సంక్రాంతి.

(2) పూరింటి పై నవ్వు
    బీర పూవులమీద
    చలి ముసుగు కప్పావు సంక్రాంతీ!
    చకిలిగిం తెట్టావు, సంక్రాంతి.

(3) పాల చిక్కుడు చిగురు
    కేలల్ల లాడింప
    నీలాలు చిలికావు సంక్రాంతీ!
    నిగ్గు లొలికించావు, సంక్రాంతి.

(4) వరిచేను తలనరసి
    వంగి జోహో రంటె
    కొడవళ్ళు పట్టించి సంక్రాంతీ!
    కూల ద్రోయించావు, సంక్రాంతి.

(5) కోడి పుంజుల జోళ్ళు
    కోలాట మేస్తుంటె
    కత్తులే నూరావు సంక్రాంతీ!
    కుత్తుకలె దరిగావు, సంక్రాంతి.

(6) మ్రుగ్గులో గొబ్బెమ్మ
    ముద్దుగా గూర్చుంటె
    మూనాళ్ళ ముచ్చటని సంక్రాంతీ!
    మోమింత చేశావు, సంక్రాంతి.

(7) గంగెద్దు సింగన్న
    సంగీతమున కుబ్బి
    తబ్బిబ్బు లయ్యావు సంక్రాంతీ!
    తందనా లాడావు, సంక్రాంతి.

____________________________________________________________________

  • సంక్రాంతినెల వచ్చేలోగా కొన్నిచోట్ల చిక్కుడు గెలవేస్తుంది. కొన్నిచోట్ల నెలబెట్టిన తరువాత గెల వేస్తుంది. దీన్ని పురస్కరించుకొని వచ్చిన యీ నానుడిని క్రొత్తింటి కోడలిమీద ప్రయోగిస్తారు. కడుపుముందా కాపురముముందా అని దీని యంతరార్థమట. ఇది ఆడుబిడ్డల పరిహాసోక్తులలో చేరుతుందనుకొంటాను.