పుట:Chandamama 1948 01.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
దొడ్లో ఆరవేసుకున్న మడిచీరకట్టుకొని పిండి రుబ్బుతున్నది.

మరి కాస్సేపటికి మొగుడు పొలం నుంచి యింటికి వచ్చి ముసుకు పెట్టుకొని పిండి రుబ్బుతున్న తన భార్యను చూచి పక్కింటి విధవరాలనుకొని "ఏమే? అయ్యో పాపం! పక్కింటామెచేత పని చేయిస్తున్నావా?" అని ఇంటివేపు చూసి అడిగాడు. "అదేమిటండీ, అలాగంటారు! బామ్మగారిని కష్టపెట్టి పనిచేయించుకోటానికి నేనేం వెఱ్ఱి దాన్నా?" అంటూ ముసుగు తీసేసి భర్తవేపు తిరిగింది.

భార్య అవతారం చూడగానే భర్త

"ఒసే నీకు యిదేం పోగాలమే? నేను బ్రతికుందగానే బుర్ర గొరిగించుకు కూర్చున్నావు?" అంటూ గొల్లుమన్నాడు.

భార్యకు ఎక్కడలేని ఉక్రోషం వచ్చింది. "చాల్లెండి. ఎంత చేసినా యింతే మీరు. బామ్మగారు చేసిందల్లా జాగ్రత్తగా చూసి గారెలు వండటం నేర్చుకోమంటిరి. సరే గదానని ఆవిడగారు చెసినట్లే నేనూ చేశాను. ఇక నన్నెందుకు తిట్టిపోస్తారు?" అంటూ ఆ వెఱ్ఱిబాగుల భార్య కళ్లనీళ్లెట్టుకుంటి.

పాపమా బ్రాహ్మడు మళ్లీ గారెలు చెయ్యమని అడిగిన పాపాన పోలేదు.


చందమామ