మీకు నేను ప్రతిరాత్రీ ఒకేవేళకు కనిపించను. అప్పుడప్పుడు అసలురాను. అందువల్ల నేను మంచివాడిని కానని అనుకొనేరు. తల్లితండ్రులంటే నాకు భయభక్తులున్నాయి. చదువుసంధ్య లేకుండా నేను అల్లరిచిల్లరిగా తిరగటం లేదు. నిజంగా నాకధతెలిస్తే ఇలా ఎందుకు జరుగుతున్నదో మీకే తెలుస్తుంది. నామీద మీకు అంత అపనమ్మకం ఉండదు. నాకు ప్రతిరోజూవచ్చి మీతో ఆడుకోవాలనేఉంది. మీకు ఎన్నోకధలు చెప్పాలనీ ఉంది. కాని ఏమిచెయ్యను?
చాల ఏళ్లకిందట, - లక్షలు, కోట్ల సంవత్సరాల క్రిందట, అప్పటికి మనిషి ఇంకా పుట్టలేదు; జంతువు పుట్టలేదు; చెట్టు పుట్టలేదు; నీళ్లుకూడాలేవు. అప్పుడు మా అమ్మ నన్ను కన్నది. మా అమ్మను మీ రెరగరూ? మీ రుంటున్నది మాఅమ్మ ఒళ్లోనేగా. భూదేవి మా అమ్మ, మా అమ్మ సూర్యునికూతురు. మా అమ్మ చిన్నప్పుడు మాతాత సూర్యుడిలాగా ఉండేదట. నేనుకూడా ఎరుగుదునుగా; నా చిన్నతనంలో మా అమ్మ ఎలా ఉండేదని! నా కళ్లుకూడా సరిగా చూడ నిచ్చేవికావు. మా అమ్మ పుట్టినప్పటి నుంచి గిరగిరా గిరగిరా మా తాత చుట్టూ బొంగరాలు తిరుగుతూ ఆడుకొంటూ వుండేది. ఆనాటి ఆటలే మా అమ్మకు ఆచారమైపోయింది. ఏదన్నా మానుతుందేమోకాని మా అమ్మ ఆ అలవాటు వదిలిపెట్టదు.
ఇలా ఉండగా నేను పుట్టాను. పుట్టి కాలు వచ్చింతరువాత ఒకచోట ఎలా కూచుంటాము. కాలుచేతులు ఊరుకోనిస్తాయా? నేనూ మా అమ్మకొంగు వదిలిపెట్టకుండా ఆమెచుట్టూ అల్లాబిల్లీ