పుట:Chandamama 1947 07.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెంటనే తండ్రిగారికి ఇలా ఉత్తరం వ్రాశాడు:

"నాన్నగారికి, ఇంతటి బుద్ధితక్కువపని చేసినందుకు విచారపడుతున్నాను. అన్నగారి బాకీ తీర్చటానికని మురుగుబంగారం కొంతనరికించి అమ్మివేశాను ఇంతకన్న పెద్ద తప్పు మరేముంది? దీనికి తగ్గ శిక్ష మీరు నాకు తప్పకుండా వెయ్యాలి. ఈ ఉత్తరం చూచిం తరువాత మీరు ఏమాత్రం విచారపడవద్దు."

ఈ ఉత్తరం మనతాతయ్య తనే పట్టుకెళ్ళి తండ్రిగారికి ఇచ్చాడు. ఆయన అప్పుడు జబ్బుపడి మంచంలో ఉన్నాడు. ఉత్తరం అందుకొని ఆయన లోలోపల చదువుకో సాగాడు. వారి కళ్లనించి కన్నీటి చుక్కలు జొటజొట క్రింద పడినాయి. అది చూడగానే గాంధితాతకు కూడ టపటపా కన్నీళ్ళు రాలాయి. కరంచంద్‌గారు అమిత ఆనందముతో, పొంగివచ్చే వాత్సల్యంతో కన్నీళ్లు నించితే, మన తాతయ్య తాను ఎంత తప్పుపని చేశానన్న విచారంతో కన్నీళ్లు నించాడు. ఇందులో ఎవరి కన్నీళ్ళు గొప్పవో మీరు చెప్పగలరా? లేక ఆ విక్రమార్కుడే దిగివచ్చి చెప్పాలంటారా?

కరంచంద్ కుమారుని ఉత్తరం చదివి మెల్లగా చించివేశాడు. కొడుకును దీవించాడు. గాంధీతాతయ్య మనసు కుదుటపడింది.

ఇలాంటి సత్యసంధతవల్లనే గాంధిజీ మనందరికీ తాతయ్య అయ్యాడు. ప్రపంచానికి మహాత్ము డయ్యాడు.