పుట:Chandamama 1947 07.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విడ్డూరంగా వుండేది. లోలోన కొంత అసూయ పడేవారుకూడా. ఎలాగైనా ఆమె మనస్సు చిన్నపుచ్చి మాన్పించాలనుకొన్నారు. ఏమిచేస్తే బాగుంటుందా అని గుసగుసలు పోయారు. అదికాదన్నారు. ఇదికాదన్నారు; చివరికి ఎలాగైతేనేం ఒక నిర్ణయానికి వాచ్చరు.

ఆనాడు రుద్రమ్మ ఉద్యానవనంలో ఒంటరిగా కూర్చునివుంది. అప్పుడే ఒక్కొక్క చెలికత్తెవచ్చి, "జయము జయము యువరాజా!" అంటూ ప్రక్కన నిలబడింది. రుద్రమ్మ తొణకలేదు, బెణకలేదు, ఠీవిగా తలఆడిస్తూ అలాగే కూర్చున్నది. చెలికత్తెలు వెలవెలపోయి బొమ్మలులాగా నిలబడ్డారు. ఉలికేవాళ్లను ఉలికించవచ్చుకాని ఉలకనివాళ్లను ఏమి చేస్తారు?

రుద్రమ్మ వాళ్లను తానే పలకరించింది. - "యువరాజుతో మీరు చెప్పుకోగల మనవి ఏమిటి," అని అడిగింది. చెలికత్తెలు నీళ్లు నమిలారు. "మీకువచ్చిన పరవా ఏమీలేదు. మీరు ఏమికోరినా యిచ్చివేస్తాను," అంది రుద్రమ్మ. చెలికత్తెలు ఒకరిముఖం ఒకరు చూచుకొన్నారు. అది అడిగితే బాగుండును, ఇది అడిగితే బాగుండునని ఒకరికొకరు సైగ చేసుకొన్నారు. చివరికి పెద్ద చెలికత్తె చేతులు జోడించి, "మీరు ఆయుధాలు ఇక ఎన్నడూ ముట్టకపోతే చాలు. అంతకన్నా మాకు కావలసిందేముండి?" అన్నది.

రుద్రమ్మ మనస్సు కటకటపడ్డది. ఇంతకాలం నేర్చుకొన్న సాముగరిడీలు ఏమికాను? ఆయుధం ముట్టకపోతే తన తండ్రి మనస్సు ఎలా వుంటుంది? మాట తప్పితే చెలికత్తెలకు తనమీద గౌరవం ఏమి ఉంటుంది? ఆమె ఆలోచించి, ఆలోచించి చివరికి అన్నది, "సరే అలాగే, కాని నన్ను ముందు సాముగరిడీలలో ఓడించాలి, అపని ఎవరుచేసినా మళ్లీ ఆయుధం పట్టను."

చెలికత్తెలకు ఎక్కడలేని సంతోషం వచ్చింది. సరేనంటే సరేనన్నారు. ఈ సంగతి రాణి నారమ్మకు చెప్పారు. ఆమెకూడా మురిసిపోయింది. కూతురు