పుట:Chandamama 1947 07.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ఓహో! నీకింత గర్వమా, సరే!" అని ఆపిచికేం చేసిందీ, గబగబా అవుదగ్గిరకెళ్ళి, "ఆవు పిన్నీ, ఆవు పిన్నీ! చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలోపడిపోతే వడ్రంగి తీసేడుకాడు, రాజు వడ్రంగిని దండించలేదు. రాజు పూలతోట లేళ్లు పాడుచెయ్యలేదు. లేళ్ల కాళ్లు బోయవాడు విరక్కొట్టలేదు. బోయ చెప్పులు ఎలక కొరకలేదు. ఎలకను పిల్లి వేటాడలేదు. పిల్లిమీద అవ్వ వేడిపాలొయ్యలేదు. తాత అవ్వను చితక్కొట్టలేదు. తాత, పాలుతియ్యడాని కొచ్చినప్పుడు 'ఫెడీ' మని తన్ను ఆవూ," అంది.

'అబ్బే, నేనలాచెయ్యను సుమా!' అంది ఆవు.

అప్పుడు పిచిక విచారిస్తూ, "పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో, ఎవళ్ళ నడిగినా ఏమీ చెయ్యనంటున్నారు ఎలాగో!" అని ఏడుస్తూ కూర్చుంది. ఇంతట్లో ఓ ఈగ ఆ దారమ్మట వెడుతూ "ఏం పిచికా ఏడుస్తున్నా" వంటే, పిచిక జరిగినదంతా చెప్పి ఉపకారము చేసి పెట్టమంది.

అప్పుడు ఈగ ఏం చేసిందీ, వెంటనేవెళ్లి ఆవు చెవులో దూరి నానా అల్లరి చేసింది. ఆవు ఆ బాధ భరించలేక తాతని తన్నింది. తాతకి కోపంవచ్చి అవ్వని చితకకొట్టాడు. అవ్వకు వళ్లుమండి పిల్లి మీద వేడి పాలోపింది. పిల్లి కోపం కొందీ ఎలక వెంటపడింది. ఎలక భరించలేక బోయ చెప్పులు కొరికింది. బోయ ఆ కోపం తీర్చుకోడానికి లేళ్ల కాళ్లను విరగకొట్టేడు. లేళ్ళు కోపంచేత రాజుగారి తోటను పాడుచేశాయి. రాజుకి బుద్ధివచ్చి వడ్రంగిని శిక్షించేడు. వడ్రంగి చచ్చినట్టు చెట్టును నరికి, తొర్ర తవ్వి ఆ చీమ తలకాయంత రొట్టిముక్కనూ, తీసి పిచిక చేతిలో పెట్టేడు.

పిచిక మళ్లీ ఎగవేసుకుంటూ ఎగవేసుకుంటు ఆ రొట్టెముక్కను కమ్మగా తిన్నది.