పుట:Chandamama 1947 07.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అటువంటి ప్రసిద్ధిగన్న కాకి వంశంలో పుట్టింది మన కాకమ్మక్క. ఆవిడ గొప్పసంగీత విద్వాంసురాలు. ఆవిడ గొంతెత్తి కాకధ్వనీ, కాకభైరవీ మొదలయిన రాగాలు పాడితే దిక్కులు మారుమోగుతాయి. వినేవాళ్ల చెవులు చిల్లులు పడతాయి.

కాకమ్మక్కయ్య మొగుడు కాకిబావ. చాలా విద్యలు నేర్చినవాడు. పిల్లల నెత్తి కొట్టి చేతిలోఉన్న అప్పచ్చులు కాజెయ్యటంలో నేర్పరి. ఇన్ని గొప్ప గుణాలుచూసే కాకమ్మక్క కాకిబావను వరించినది.

ఒకనాడు పొద్దున్నే కాకిబావయ్య కాకమ్మక్కయ్యతో అన్నాడు గదా:

"ఒసే, కాకామణీ! మనం ఈపూట ఎక్కడికైనా మంచిచోటికి విందుకుపోతే ఎట్లా ఉంటుందే?" అన్నాడు.

బావకు సంతోషంగా ఉన్నప్పుడు అక్కయ్యను కాకామణీ అని పిలుస్తాడు.

"బాగానే ఉంటుంది. ఎవరి ఇంటికి పోదాం?" అని రాగం తీసింది కాకమ్మ. కాకమ్మాక్క ఎప్పుడూ మామూలుగా మాట్లాడదు, సంగీతంలోతప్ప.

"దగ్గిరే నాయుడుగారిల్లుంది. పొద్దుటి పూట వారింటో చక్కని ఇడ్డెనలూ, ఉప్మా చేసుకుంటారు. అయితే నాయుడు గారు కుంభకర్ణుడు. బారెడు పొద్దెక్కిగాని లేవడు. ఏం మనుషులో వీళ్ళు! మనలాగా నీళ్లకు తెల్లారుజామునే లేచే అలవాటులేదు. వొట్టి సోమరిపోతులు. మన యిద్దరమూ నాయుడుగారింటికి పోదాం. నువు కమ్మగా ఆయనకు మేలు కొలుపులు పాడు. అప్పుడాయన లేచి మనకు ఫలహారం పెట్టిస్తాడు," అన్నాడు కాకిబావ.

నాయుడిగారి ఇంటిపక్కనే వేపచెట్టు ఒకటి ఉంది. దానికొమ్మ ఒకటి మేడ మీదికి ఉంది. ఆ కొమ్మమీద కాకి దంపతులు కూర్చున్నారు. ఇద్దరూ గొంతులు కలిపి ముచ్చటగా నాయుడుగారికి మేలు కొలుపు పాడ నారంభించారు.