పుట:Chandamama 1947 07.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకులు పురాణకాలంనించికూడా ప్రసిద్దిగన్నవి. వెనక ఎప్పుడో ఒక కాకి అగస్త్యుడి కమండలం ఒలకబోసిందట. అప్పుడు అందులో ఉన్న గంగ బయటికి వచ్చి నదిగా ప్రవహించింది. శ్రీరామచంద్రుడు సీతతో అరణ్యంలో ఉన్నప్పుడు ఒకనాడు ఒక కాకివచ్చి సీతామహాదేవి రొమ్ముమీద పొడిచింది. రాముడికి కాకిమీద ఆగ్రహం వచ్చింది. దగ్గిరఉన్న గడ్డిపరక ఎత్తి కాకిమీద విసిరాడు. కాకిభయపడి మూడులోకాలూ తిరిగింది. రక్షించేవారు లేక ఆఖరుకు రామచంద్రుడినే శరణువేడింది. కాకికి ప్రాణం దక్కిందిగాని ఒక కన్ను పోయింది.

ఆనాటినుంచీ కాకులకు ఒంటికంటి చూపే.

కాకి ఎట్లా చూస్తుందో మీ రెరుగుదురుగాదూ?

కాకులలో ఉన్నకొన్ని మంచి లక్షణాలు మనుషులలో కూడా లేవు. వాటిలో వర్ణభేదంలేదు. అందుకనే 'తెల్లనికాకులునులేవు తెలియర సుమతీ' అన్నాడు కవి. కొన్నికాకులను మనం మాలకాకు లంటాం, కాని నిజంగా వాటిలో అంటరానితనం లేదు. కాకులు ఇళ్లకప్పులమీద వరసగా కూర్చుని చదువుకోవటం చూశారా? దాన్నే కాకిబడి అంటారు. కాకుల్లో ఇంకో మంచి బుద్ధికూడా ఉంది. ఒక కాకికి తినేటందుకేమైనా దొరికితే అన్ని కాకులనూ పిలుస్తుంది. అంతేకాని తనపొట్టకు మాత్రమే చూసుకోదు. వీటినిబట్టి కాకులు చాలా గొప్పవని చెప్పవచ్చు.