పుట:Chandamama 1947 07.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుకాణంవాడికి పొడుముడబ్బీ, డబ్బులూ ఇచ్చి, పక్కనే గారడీ జరుగుతుంటే తొంగిచూశా. గారడీవాడు తురకంలో ఏదో చెబుతున్నాడు. వాడితో ఇంకొకడు పాడుతూ డోలు కొడుతున్నాడు. "ఓ అబ్బాయిలూ, మీలో ధైర్యంగలవా డెవడైనా ఇట్లా రండి"' అని గారడీవాడు పిలిచాడు. ఎవరూ రాలేదు. గారడీవాడికళ్లు నామీద పడ్డాయి. నామనసు ఊగింది పోవాలని. కాని మేష్టారిపొడుముడబ్బీ, బెత్తమూ జ్ఞాపకం వచ్చి, గబగబా దుకాణం దగ్గిరికిపోయి అక్కడఉన్న డబ్బీ తీసుకుని బడికి పరుగెత్తా. డబ్బీ మేష్టారి బల్లమీద పెట్టి వచ్చి మళ్లీ నాచోటులో కూర్చున్నా.

మేష్టారు తేలుబొమ్మవేసి బల్లదగ్గిరికివచ్చి చూసుకునేసరికి బల్ల మీద నిప్పుపెట్టె ఉంది. ఇదేమిటని దాన్ని తెరిచిచూసేసరికి అందులోనుంచి ఒక తేలుపిల్ల బయటికి వచ్చింది. "రాముడు మేష్టారికి తేలుపిల్ల బహుమానం తెచ్చాడు", అని క్లాసులో పిల్లకాయలు అరిచారు. నావీపు చెడింది అనుకున్నా.

"పొడుమేదిరా, రాముడా?" అని అయ్యవారడిగాడు. అప్పుడు నాకు తెలిసింది, మేను పొడుముడబ్బీకి మారుగా ఎవరో అల్లరి పిల్లకాయపెట్టిన నిప్పు పెట్టె తెచ్చానని.

"ఇప్పుడేవెళ్లి క్షణంలో తెస్తానండీ", అంటూ మళ్లీ దుకాణానికి దౌడుతీశా.

నాస్థితి కనిపెట్టి దుకాణదారు నన్ను చాలాసేపు ఏడిపించి, నాచేత నీళ్లు తెప్పించి, దుకాణం ఊడ్పించి, ఆఖరుకు డబ్బీ ఇచ్చి పంపించాడు. ఆవిధంగా ఆరోజు భగవంతుడి అనుగ్రహంవల్ల నాకు దెబ్బలు తప్పాయి. పొద్దున్నే లేచి ఎవరిదో మంచిమొహం చూసి ఉంటా