పుట:Chandamama 1947 07.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"కోతివెధవా, పుండాఖోఠ్, బద్మాష్" అని తిడుతూ నామీదకివచ్చాడు. ఎన్ని దెబ్బలు తిన్నానో నేను లెక్క పెట్టలేదు. ఆ దెబ్బలతో ఆయనకోపం తీరిందో లేదో తెలియదు. అసలాయన నన్నెందుకు కొట్టిందీ, నేనేం తప్పుచేసిందీకూడా నే నెరగను. వాచినకళ్లతో, బూరెలాగా పొంగిన వీపుతో ఇంటికి వెళ్లేటప్పుడు మాక్లాసు పిల్లకాయ ఒకడు నాతో చెప్పాడు: మేష్టారిపేరు రమణయ్యట; ఆయన చకచక ఎవ్వరికీ అందకుండా నడుస్తాడట. అందుచేత ఆయనకు మాయలేడి అని పేరుపెట్టారట. అందుకనేనట ఆ పేరంటే ఆయనకు కోపం.

మర్నాడు నాకు బడికిపోటానికి బుద్ధిపుట్టలేదు. కాని మానాన్న మొట్టికాయల కంటే పంతులుగారి బెత్తమే నయమని వెళ్లాను. మేష్టారు నిన్న అనవసరంగా నన్ను కొట్టినందుకు ఇవాళ చాలాబాగా చూశారు. ఇవాళ మేష్టారికి డ్రాయింగు బొమ్మ వెయ్య బుద్ధయింది. చాక్‌పీసు తీసుకుని తేలుబొమ్మ వేస్తూండగా ఆయనకు పొడుంపీల్చవలిసిన అవసరం వచ్చింది. రొండినుండి పొడుండబ్బీ తీసిచూస్తే అందులో పొడుములేదు.

ఆయన నాకేసిచూసి, నవ్వి, ఎంతో అపేక్షగా, "ఒరే, నాయనా, రాముడూ, ఇలారా", అన్నాడు. నాకు చెమటలు పోశాయి. కాళ్లు వణుకుతూ అయన దర్గిరికి వెళ్లా. "ఒరే, అబ్బాయీ, ఈ పక్కదుకాణానికివెళ్లి ఒక అర్ధణా నస్యం వేయించుకు రా గలవూ?" అన్నాడు. "వేయించుకు వస్తానండీ, నాకు దుకాణాలకు వెళ్లటం అలవాటే, మా వీధిలో వాళ్లందరికీ సరుకులు నేనే తెచ్చిపెడతాను, ఇవ్వండి," అన్నాను ఉత్సాహంతో. ఆయనదగ్గిర పొడుము డబ్బీతోపాటు రెండు కాన్లు తీసుకుని బయటికి పరుగెత్తాను.