పుట:Chandamama 1947 07.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూడామణి

ఎంతో ముచ్చటపడి మా అమ్మా నాన్నా నాకు శ్రీరామచంద్రమూర్తి వారిపేరు పెట్టుకున్నారు. పేరుపెట్టారే కాని అంతపొడగుపెట్టి పిలవటానికి వాళ్లకే ఓపిక లేకపోయింది. అదీకాక నావంటి చిన్నిబుర్రగలవాడికి ఇంతపెద్ద పేరుదేనికీ? అందుచేత నాపేరు కుదించి 'రాముడు' అన్నారు. ఐతే, ఊళ్లోవాళ్లు ఈ పేరుకు ముందు రకరకాల తోకలు తగిలించారు. విష్ణుమూర్తికి వేయినామాలుంటే నాకు రెండువేలున్నాయి - బండరాముడు, మొద్దురాముడు, రాచ్చిప్పరాముడు, తిక్కరాముడు, మట్టిబుర్ర రాముడు, అడ్డతలరాముడు, పిచ్చిరాముడు, వెర్రిరాముడు, మన్నుతిన్నరాముడు, నిద్రమొహంరాముడు, దున్నపోతురాముడు... ఇలా ఎన్నో మీకు కూడా ఏదన్న మంచిపేరు దొరికితే దానితో నన్ను పిలిచుకోండి, నాకేమి అభ్యంతరము లేదు. కాని నాకుమాత్రం ఈ పేర్లన్నిటిలోకి బండిరాముడనే పేరు బాగుండేది. అ పేరుతోనే జాస్తిగా నన్ను పిలిచేవాళ్లు.

మా అమ్మ నన్ను, "రా....ము....లూ!" అని చాలా పొడూగ్గాపిలిచేది. మా నాన్న మటుకు నన్ను రకరకాలుగా పిలిచేవాడు. ఆయన ఒకసారి పలికి నట్టు మరొకసారి పలికేవాడుకాదు.