పుట:Chandamama 1947 07.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


Chandamama 1947 07.pdf

అనగా అనగా ఒక పెద్ద రావిచెట్టు. ఆ చెట్టు కొక పెద్దకొమ్మ. ఆ కొమ్మకొక చిన్న రెమ్మ. ఆ రెమ్మకొక చిన్ని చిగురుటాకు. చిగురుటాకును గాలి చల్లగా జోకొట్టింది. సూర్యకిరణాలు వెచ్చగా మేలుకొలిపాయి. ఆనందంతో ఉబ్బిపోయింది, చిగురుటాకు.

ఇంతలో ఒకపాట సన్నగా వినిపించింది. ఈ పాట చుట్టుపట్ల చెట్లమీదినుంచి సన్న సన్నగా వచ్చింది. ఈ పాటను పండుటాకులు విన్నాయి. అవికూడా పాట అందుకున్నాయి. రావిచెట్టుమీది పండుటాకులన్నీ పాడసాగాయి.

చిగురుటాకు ఈపాట విన్నది. ఈ పాట ఏమిటో దానికి అర్థం కాలేదు. ' పండుటాకులు రాలే వేళయింది ' అని చెప్పింది పక్క ఆకు.

రాలి కిందపడటంలో ఆనందం ఉండి ఉండాలి అనుకున్నది చిగురుటాకు. రాలి కిందపడే భాగ్యం తనకు లేదే అని విచారించింది చిగురుటాకు.