పుట:Chandamama 1947 07.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవి సరేనన్నది. రామలింగం అప్పుడు చెప్పాడు: "అమ్మా! మాకు ఒకటే ముక్కు, కాని రెండుచేతులున్నాయి. ఎప్పుడన్నా జలుబు చేస్తే ఈ ఒకముక్కు చీదుకోటానికే రెండుచేతులు చాలటంలేదు. ఇక మీకా వెయ్యితలలు. కర్మంజాలక జలుబుచేస్తే ఆ వెయ్యిముక్కులు చీదుకోటానికి ఈ రెండుచేతులు ఎలా చాలుతాయా అని నవ్వు వచ్చింది."

దేవికూడా అతనిమాటకు నవ్వి - "నాయనా, నన్నుచూచి నవ్వినవాడివి ఇక నువ్వు ఎవరిని చూచి నవ్వవు గనుక. నీవు తప్పకుండా వికటకవి వవుతావు," అంది.

రామలింగం నమస్కరించి "తల్లీ ఎటుతిప్పి చదివినా చెడనిమాట వరంగా ఇచ్చావు. ఇంతకంటే నాకు ఏమికావాలి," అన్నాడు.

కాళిక అతని తెలివితేటలకు మెచ్చుకొన్నది. 'వికటకవి' అనే మాట ఎటు తిప్పిచదివినా మారేది ఏమి ఉంది> దేవి సంతోషించి మరొక వరంకూడా అతనికి ఇచ్చింది. "నీవు రాజాస్థానంలో విదూషకుడ వవుతావు. అంతే కాదు. నీలాగా పద్యం కూర్చటం మరొకరికి చేతకాదు." అని ఆశీర్వదించింది.

రామలింగం వికటకవిగా ప్రసిద్ది కెక్కాడు. ఆయనపేరుతో ఎన్నో హాస్య కథలు ఉన్నాయి. ఇవిగాక వీరు రెందు మహాకావ్యాలు వ్రాశాడు. ఉద్భటారాధ్య చరిత్ర ఒకటీ, పాండురంగ మాహాత్మ్యం రెండూ.

పెద్దవాళ్లయినాక మీరు వాటిని చదువుతారు కదూ.