Jump to content

పుట:Chaduvu VBS JVV.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1

ఒక సహస్రాబ్దం దాటి మరో సహస్రాబ్దపు వాకిట్లోకి మనం వచ్చాం. 500 కోట్ల సంవత్సరాల పుడమితల్లి సుదీర్ఘ చరిత్రలో మానవుడిది అంతా కలిపి 40 వేల ఏళ్ళకు మించని చరిత్ర. ఈ కాలగర్భంలో వెయ్యేళ్ళంటే సింధువులో బిందువు కిందే లెక్క.

ఒక్కక్షణం కళ్ళు మూసుకొని తృప్తిగా వెనక్కు చూస్తే మనమెక్కడి నుంచి ఎక్కడికి ఎంత దూరం పయనించాం! కొండగుహల్ని వదిలేసి, హిమయుగాల్ని సవాలుచేసి, రాతి పనిముట్లకు వీడ్కోలిచ్చి, నదీతీరాల్లో నాగలిపట్టి, మహా నాగరికతలు నిర్మించి, అఖండ సామ్రాజ్యాలు నెలకొల్పి, ఆవిరికి చలనం నేర్పి, విప్లవాలు రేపి, తాత్విక చర్చోపచర్చలు జరిపి, భూనభోంతరాళాలు శోధించి, సముద్రాల్ని మధించి, అణువుని ఛేదించి, జన్యువును జయించి, సైబర్ యుగంలో నిలుచుని కొత్త సహస్రాబ్దికి నేడు మనం స్వాగతం చెపుతున్నాం.

ఈ మహాప్రస్థానంలో ఏ ఘట్టం విలువ ఆ ఘట్టానిదే. ఏ అన్వేషణ ప్రాధాన్యత ఆ అన్వేషణదే. ఏ యుగం ప్రత్యేకత ఆ యుగానిదే. తొలి యంత్రం విల్లు కన్నా అణుబాంబు శక్తిమంతమని ఎలా చెప్పగలం? నిప్పు కనుక్కోవడం కన్నా నింగిలోకి ఉపగ్రహాల్ని వదలడం విలువైందని ఎవరు చెప్పగలరు? మొహంజదారో గృహాల కన్నా, ముంతాజ్బేగం స్మృతి మహలు మానవాత్మకు ప్రతీకగా ఎలా నిర్ధారించ గలం? రాతియుగపు గుహా చిత్రాల కంటే రవివర్మ బొమ్మల్లో నైపుణ్యమెక్కువని ఎలా రుజువు చెయ్యగలం? ఆదిమ మానవ అనుబంధాల కంటే ఆధునిక యుగ సంబంధాలు ఉన్నతమైనవని ఎలా మురిసిపోగలం?

సుఖం కోసం శ్రమ, సత్యం కోసం శోధన, స్వేచ్ఛ కోసం తపన, సౌందర్యం కోసం ఆరాధన, సాధన కోసం సాహసం, సంతృప్తి కోసం త్యాగం మానవుడి ఆజన్మ జీవ లక్షణాలు. సహస్రాబ్ధాలు గడిచినా, శత సహస్ర సహస్రాబ్దాలు దాటినా మానవుజ్జీ లక్షణాల నుంచి వేరు చెయ్యలేం. వేరుపడితే మానుడిక వొట్టి డొల్లే!

కొత్త సహస్రాబ్దం తలుపు తడుతున్న వేళ మన చదువుల్లో ఈ మానవ జీవ లక్షణాలు వేయి పూలుగా వికసించాలని కోరుకొందాం. ఈ జీవలక్షణాల్ని మన ఉపాధ్యాయులు పుణికి పుచ్చుకోవాలని ఆశిద్దాం.

సందర్భం: నూతన సహస్రాబ్ది 2000 చదువు