'భావాలు గడ్డ కడితే అవి కూడా ఒక భౌతికశక్తిగా అవుతాయి,' అంటారు తత్వవేత్తలు.
స్థిరమైన భావాలుండటం వేరు. గడ్డకట్టిన భావాలుండటం వేరు.
విద్యలాంటి సాంస్కృతిక అంశాలపై మనకుండే భావాలు ఎలాంటివి? వీటిని మార్చుకోవల్సి ఉందా? అవసరమైతే వదిలించుకోవల్సి ఉందా? అందుకు మనం ఎంత సిద్ధంగా ఉన్నాం?
గణితం మగపిల్లలకు అబ్బినంతగా ఆడపిల్లలకు అబ్బదని ఒక భావం. భాష శిష్ట వర్గాలకు ఒంటబట్టినట్టుగా అణగారిన వర్గాల పిల్లలకు ఒంటబట్టదని ఒక భావం. ఏ చిన్న తప్పు దొర్లినా ఎక్కడ భాష మైలపడిపోతుందో అనేది ఇంకో భావం.
బడి ఇంటి సంస్కృతిని, స్వీయ పరిసరాల ప్రభావాన్ని తుడిచేసి సరికొత్త మానవుణ్ణి రూపొందించాలని మనమనుకొంటాం. అందరినీ నాగరికులుగా మార్చాలనుకొని వైవిధ్యాల్ని వైరుధ్యాలుగా భావిస్తాం. నాగరికుల నుంచి అట్టడుగు వర్గాలవారు నేర్చుకోవాల్సి ఉంటుంది . గానీ కాయకష్టం చేసే వారి నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదని మన విశ్వాసం. మన సహస్రాధిక చేతివృత్తుల్లోనూ హస్తకళల్లోనూ భారతీయాత్మ దాగి ఉంది. పరంపరాగత విజ్ఞానం విస్తరించి ఉంది. కానీ దీన్ని మనం అంత సులభంగా ఒప్పుకోం.
విద్య సార్వజనీనం అయ్యేకొద్దీ మన లక్ష్యం అందరికీ విద్యగా మారే కొద్దీ ఈ భావాల్లో చాలా మార్పు రావల్సి ఉంటుంది. మన తరగతి గది స్వరూప స్వభావాలూ మారాల్సి ఉంటుంది. వైవిధ్యాన్ని ఒక వనరుగా గుర్తించాల్సి ఉంటుంది. పరస్సరాదాన ప్రదానాలు పిల్లల మధ్య ఒక సమాన స్థాయిలో జరగడం బోధనలో ఒక కీలకాంశం కావల్సి ఉంది.
దీనికి మన గడ్డకట్టిన భావాలు అడ్డమైతే వాటిని సహనంతో సరిదిద్దుకోవాల్సి ఉంటుంది.
చదువు 8