ఈ పుట ఆమోదించబడ్డది
5. తే|| పదవ తరగతి పఠియించు వయసునందె
ధనిక పేద భేదము గాంచి తల్లడిల్లి
గేయరచనకు పూనిన కీర్తనీయ
వినుతికెక్కిన మతినీది వినుసినారె!
6. ఆ|| పద్యనాటికలను ప్రారంభ దశలోన
వ్రాసినాడ వీవు వాసికెక్కి
నటన 'నైపుణ్యమ్ము' పటుతరముగ జూపి
వినుతులందినావు ఘనసినారె!
7. తే|| దాశరథియు నీవు తరుణకవిత వ్రాయ
కవులలోకమ్ము ఏకమై కంఠమెత్తి
ఘన తెలంగాణనయన యుగళము మీరు
అనుచు వినుతింప వినలేదొ ఘనసినారె!
8. తే|| శీలవతియైన భార్య సుశీలపేర
ట్రస్టు స్థాపంచి మిక్కిలి రాగమెసగ
ఉత్తమ రచయిత్రిని యెంచి యుజ్జ్వలముగ
గౌరవింతువు ఏటేట ఘనసినారె!
9. తే|| గంగ యమున సరస్వతి పొంగుచుండ
కృష్ణవేణియు కలసెను తృష్ణదీర్ప
నీకు కూతురై, కవితలై నిర్మలాత్మ!
ప్రతిభయన నీదె పలుకంగ వరసినారె!