పుట:CNR Satakam PDF File.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్యాగరాయ గానసభలో వారిచేత ఆవిష్కరింప చేశారు. ఆ తర్వాత కృష్ణాజిల్లా రచయితల సంఘ౦ పక్షాన ప్రపంచ తెలుగు రచయితల సభలలో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, శ్రీ మండలి బుద్ధా ప్రసాద్‌ గార్లు తెలుగుభాష, సంస్కృతీ చైతన్యయాత్రలు నిర్వహించినప్పుడు గుంటూరులో సి.నా.రె.తో సభలో పాల్గొనే అద్రుష్ట౦ కలిగింది.

శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా నేను మహాకవి శ్రీశ్రీ శతకాన్ని రచిస్తే గ్రంథపరిచయ సభను ఏర్పాటు చేసిన డా|| ద్వానా శాస్త్రి గారు నేను నానీలలో సి.నా.రె. రాశాను. నువ్వు సి.నా.రె. శతకం రాయి. కానీ అన్ని పద్యాలు కవిని గురించి, కవిరచనలు గురించి మాత్రమే ఉండాలి. ఇతర విషయాలు ఆ శతకంలో ఉండకూడదు. అని సూచించారు. వారి సూచన ప్రకారమే నేను 2012లో 90 పద్యాలు రాసి అలా ఉంచాను. 2013 మార్చిలో మిగిలిన పద్యాలు రచించి శతకం పూర్తి చేశాను. ఈ పద్యాలన్నీముక్తకాలు.

సి.నా.రె. జీవితం, సి.నా.రె. రచనలు, సి.నా.రె. కవితల్లో ఉండే విశేషాంశాలు, రచనారీతి, సి.నా.రె. స్వభావం, ఆధునిక కవుల్లో సి.నా.రె. ప్రత్యేకత మొదలైన అంశాల్ని ఈ శతకంలో పొందుపరిచాను. సి.నారె. వచన కవితలే పద్యరూపాన్ని ధరించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఏది ఏమైనా ఒక మహాకవిని గూర్చి శతకాన్ని రచించే అదృష్టం కలిగినందుకు సంతోషిస్తూ నా ఈ రచనను పాఠకులు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.


డా. గుమ్మా సాంబశివరావు