ఈ పుట ఆమోదించబడ్డది
105. తే|| "రంగు లొలుకు ఊహలలోన పొంగిపోకు
ముసుగులో సుఖముల నల్లి మురిసిపోకు
రేపు వచ్చు దుర్గంధపు రేఖ గనుము"
అనుచు బోధలు సేసితే ఘనసినారె!
106. తే|| మనసులోన స్వచ్ఛత యున్న మంచిమాట
సూటిగా వచ్చి చేరును, శుభము గూర్చు
పారినప్పుడే ఏటిలో నీరు తేట"
యనుచు సత్యమ్ము దెలిపితే ఘనసినారె!
107. తే|| 'బురదలో నున్న తరగదు పువ్వు విలువ
తాటియాకు పద్యము విల్వ తరగకుండు
అసలు పసయున్న నెవ్వార లడ్డలేరు'
అనుచు వ్రాసితే కవితలు ఘనసినారె!
108. తే|| "మట్టి గుక్కను పలికించ మంచి చినుకు
నవ్వు చుక్కలు మొలిపించ రువ్వు చెణుకు
నింగి పక్కను దొరలించ నిక్కు మెఱుపు"
ఒక్కిటియె చాలునంటివే ఉరుసినారె!
109. తే|| కొత్తదారి దొరుకు కొండను చీల్చంగ
నిజము అంతదేలు నింగి పేల్చ
ముడుచుకొనుచు నున్న మూలమ్ము అందునే!
అనుచు వ్రాసితీవు ఘనసినారె!