పుట:CNR Satakam PDF File.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80. తే|| పలుకుబడియె ఆస్తియగుచు వరలుచుండి
మాటమూటలే నిధిగాగ మసలుచుండి
భావపరిమళద్రవ్యమ్ము పంచెదీవు
సాహితీ ధన ఘన ప్రభాసా! సినారె!

81. తే|| గానయోగ్యత గల్గిన ఘన 'రుబాయి'
పథమునందున నడచి 'ప్రపంచ పదులు'
వ్రాసి - జీవితానుభవము పంచి యిచ్చి
క్రొత్త ప్రక్రియన్‌ గూర్చితే గురుసినారె!

82. తే|| సృష్టికైనను మరి యింక దృష్టికైన
మార్పు అనివార్యమన్నట్టి మాటతోడ
"మట్టి, మనిషి ఆకాశమ్ము" గట్టి దీర్ఘ
కవితగా కూర్చి మించితే ఘనసినారె!

83. ఆ|| "వచనకవితగాని పాటయయిన గాని
కవితలోన విత్తి కాంచినపుడు
సహృదయముల యందు చైతన్యమై మొల్చు"
ననుచు నమ్మితీవు ఘనసినారె!

84. ఆ|| "పలకరింతలోన పులకరింత గలదు
మాట ఖర్చగునని మానరాదు
వ్యష్టి నుండి అది సమష్టిలోనికి చేర్చు"
ననుచు వ్రాసితీవు ఘనసినారె!