Jump to content

పుట:CNR Satakam PDF File.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

75. ఆ|| "అనుభవమ్ము పండి అలరారు వృక్షమ్ము
ముసలితనమనంగ మోదమగును
దాని దాచబూన తనవల విసరదా"
అనుచు పలికితీవు ఘనసినారె!

76. తే|| జాతిస్వాతంత్య్ర గాధను సరిగ గూర్చి
శ్రవ్యరూపకసరణిలో వ్రాసితీవు
దేశబక్తిని పొంగించు దివ్యరచన
చేసి మించిన ఘనుడవు శ్రీసినారె!

77. తే|| "ఏ.సి. గదిలోన కూర్చున్న నేమొగాని
ఉక్కబోస్తున్న తీరున నుంటినేను
కంటి, కవిత వ్రాయని యట్టి కారణమున
ఇటుల జరిగెనంటివి" నీవు హితసినారె!

78. తే|| తెలుగు సినిమాల సొగసులు దిద్దితీర్ప
హరికథలు బుర్రకథలు సరసరీతి
మధ్యమధ్యలో కూర్చిన మధురమతివి
ఖ్యాతి గూర్చెను అవి నీకు ఘనసినారె!

79. తే|| నిత్యసాహితీ వ్రతుడవై సభలలోన
శబ్దవిన్యాస మొనరించి సాగెదీవు
జీవనది నీదు సాహితీ జీవనమ్ము
శిష్టకవిగేయభాసురా శ్రీసినారె!