పుట:CNR Satakam PDF File.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70. తే|| సంస్థ నీతిమార్గమునందు సాగినపుడు
మంచి ఆశయమ్ములవియె మహిని నిల్చు
చెట్టు పచ్చగా నుండంగ చిగురు, పండ్లు
పుట్టునని చెప్పినాడవు బుధసినారె!

71. తే|| అన్నిపదవుల జోక్యమ్ము మిన్నయగుచు
జలగవోలెను పీడంచు జగతినెపుడు
ఇలసి ఫారసుల్‌ పరిశోధనలకు కూడ
చేయ భావ్యమ్ము కాదంటి శ్రీసినారె!

72. తే|| జ్ఞానపీఠమ్ము పొందిన జ్ఞాపకమ్ము
షష్టివత్సర ఉత్సవాల్‌ సాగునపుడు
పుట్టె 'ఆరోహణ' మనెడు పొత్తమొకటి
తీయనౌ అనుభూతిగాదే సినారె!

73. తే|| మనిషియ పల్లవియనుచు మనిషి అవధి
మనిషి ఆకాశము, పతాక-మనిషి నాకు
అగును ఉచ్చ్వాస నిశ్వాస మనుచు కవిత
వ్రాసిన మహామనిషి వీవు వరసినారె!

74. తే|| "నాదు వచనమ్ము బహువచనమ్ము సుమ్ము
సామ్యవాదమ్ము నావాద సరణి దెలుప
మాతృభాష కవిత్వమౌ మానవతయె"
అనుచు గొప్పగా వ్రాసితే ఘనసినారె!