ఈ పుట ఆమోదించబడ్డది
55. తే|| నీదు సాహిత్య శోధన నియతి జేసి
విశ్వవిద్యాలయమ్ముల బిరుదులంద
వ్రాసిరెందరో సిద్ధాంత గ్రంథములను
రస జగన్నాథుడవు నీవు రహిసినారె!
56. తే|| ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రాంగణమున
పుస్తకావిష్కరణములు - బుద్ధి పెంచు
చర్చలు, ప్రసంగములు కళోత్సవములెన్నో
నిర్వహించిన ఘనుడవు నెఱిసినారె!
57. తే|| నీదు వ్యాస 'సమీక్షణ' నిర్మితిగన
సద్విమర్శకు నిలువెత్తు సాక్ష్యమగును
ఉత్తమ విమర్శకుడవీవు ఉర్వియందు
అనుచు జగమెల్ల నుతియించె వినుసినారె!
58. తే|| నవ్యభారత నిర్మాణ నాయకుండు
జ్ఞాని జవహరులాల్‌నెహ్రు ఘనత చాట
'జాతిరత్నము' కావ్యమ్ము సరసరీతి
వ్రాసి ఘనకీర్తి నందితే వరసినారె!
59. తే|| నాట్యరీతులు, కవితలనల్లు తీరు
చిత్రలేఖన, శిల్పాలు చెలగురీతి
మేటి విశ్వంభర రచనన్ పాటవముగ
వెలువరించిన ఘనుడవు వినుసినారె!