ఈ పుట ఆమోదించబడ్డది
15. ఆ|| ఛాత్రవర్గమెల్ల చకితమై వినుచుండ
పాఠములను జెప్పు పంతులయ్య
పాఠ్య బోధనమున ప్రథమపీఠము నీది
గురుతు కెక్కినట్టి గురుసినారె!
16. ఆ|| కొత్త కవులు తాము పొత్తముల్ రచియించి
ముందుమాట కొఱకు ముచ్చటింప
అతులప్రేమజూపి అందించుచుందువు
వేగమైన రీతి వినుసినారె!
17. ఆ|| కలము నాపకుండ కదలించి కవితలు
సృష్టి చేయునట్టి ఋషియితండు
కాలమునకు వెంట కదలుచుండెడి కవి
అనుచు నిన్ను పొగడ వినుసినారె!
18. ఆ|| క్రొత్త కవుల వోలె క్రొంగొత్త ఊహలన్
కవితలల్లునట్టి కవి వరేణ్య !
ఊహలూరు చెలమ ఉరువైన నీమది
అనుచు పలుక నిజము ఘనసినారె!
19. ఆ|| కాలిదెబ్బ వలన కదలకయున్నను
కవిత నడక సాగె ఘనముగాను
నీదు కలము జూడ నింద్రుని వజ్రమ్ము
కవిసురపతివీవు ఘనసినారె!