పుట:Bobbili yuddam natakam.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్ట మాంకము. 89

బుస్సీ. - ఈక్షణము పోయి, హసేనల్లీ సర్దారుతో మామాటగా చెప్పుము. 'నీవు మా పరంగి తురుపు 200లతో, సకలపదార్థములతో, సవారిలో ఈవేంకటలక్ష్మమ్మను ఈచిన్న రాయనింగారిని, ఎక్కించుకొని, సామర్లకోటకు కోనిపోయి, తగిన మరియాదతో ఈయన పినతల్లికి అప్పగించి, మాసలాములుచెప్పి, మమ్ము కలసికోవలసినది.' అనియు, 'దారిలో ఈరాజు ఏమయిన శిశువునకు అపాయము చేయుటకు పన్నాగము పన్నెనా, దానిని నీవు హతము చేయవలసినది.' అనియు, 'ఇక్కడ రాజును మేము భద్రముగా కాపు కాచెదము,' అనియు, చెప్పుము. వీరిం దోడ్కొని పొమ్ము. [అని బాలుని ఎత్తుకొని ము ద్దిడి, పండిచ్చి, దింపి] బాబూ, పోయివచ్చెదవా ?

బాలు. - పోయి వత్తాం, తలాం.

వేంకట. - సలాము దొరగారికి. ఒక మడుగులోనే మొసలియు, రాజహంసయు నున్నవి. అట్లే ఈసేనలోనే ఈరా జున్నాఁడు, మీరును ఉన్నారు. మీ రన్నట్లు, ఈయనను, పాపము కొట్టునుగాని మానదు. సెలవు పుచ్చుకొంటిమి.

[నౌకరు, బాలుఁడు, వేంకటలక్ష్మియు నిష్క్రమింతురు.]

రాజు. - ఎవరురా అక్కడ మానౌకరులు ?

నౌకరు. - [ప్రవేశించి] జయము జయము మహాప్రభువుగారికి. ఏమి యాజ్ఞ?

రాజు. - ఈక్షణమే పోయి, ఎల్లుండి తెల్లవాఱు నప్పటికి మాబాబును ఆనందరావును ఇక్కడికి బొబ్బిలి పట్టాభిషేకార్థమై సర్వసన్నాహముతో తోడ్కొనిరండు.

నౌకరు. - చిత్తము ఏలినవారియాజ్ఞ. [అని నిష్క్రమించును.]

బుస్సీ. - ఇఁక మారందఱు పొండయ్యా; నేనును నాయాందోళన తీఱునట్లుగా, ఏసుదేవుని గూర్చి నాతప్పులు మన్నింపు మని ప్రార్థనచేసికొని విశ్రమించెదను.

ఇతరులు. - సలాము, సలాము, సలాము. [అని నిష్క్రమింతురు.]

బుస్సీ. - నేనును ప్రార్థానాపవరకమున కేఁగెద. [అని నిష్క్రమించును.]

____________