Jump to content

పుట:Bobbili yuddam natakam.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బొబ్బిలియుద్ధనాటకము. 84

బుస్సీ. - ఎవ రమ్మా మీరు? సంకోచము లేకుండ ఉన్నమాట చెప్పుఁడు. మీకు మేము చెఱుపు చేయము. ఇంత బీరము గల యాఁడువారికి ఎవరైనను గౌరవము చేయవలసినది.

వెంకట. - అయ్యా, మీరే బుస్సీదొరగా రని నాకు తోఁచుచున్నది. వారే విజయరామరాజుగారు. కానిండు. నేను బొబ్బిలి రంగారాయనింగారి జనానా దాసీ జనము ముప్పది ముగ్గురలో తలదాసిని. ఈ కూన చినవెంకటరావు మాయేలిన వారికి ఒక్కడే కుమారుఁడు. ఈయనను ఈయనతల్లి మల్లమ్మదేవి మమ్మేలినతల్లి ఈ రాజుచేతఁ బడనీయక సామర్లకోటలో చెల్లెలియిల్లు చేర్పు మని నాకు అప్పగించినది. నేను ఒప్పుకొని 'నాబొందిలో ప్రాణ ముండగా' బాలునికి అపాయము లేదని పలికి, బాపన బాలునివేసాన కొనిపోవుచుండఁగా, మీ మ్రోలకు మమ్ము తెచ్చినారు. మీరు దొడ్డవా -----. అటుపైని మీ చిత్తము.

బుస్సీ. - బళిబళీ ! నీవు వారి పాలిటి ధర్మదేవతవు, మిమ్ము నేను రక్షించెదను.

రాజు. - గిళి గిళి ! ఈ బాలుని ఏనుఁగు కాలిక్రింద మట్టించి నేలఁ గలప వయ్యా బూసీదొరా !

బుస్సీ. - ఏమి పాపాత్ముఁడవురాజా ! అట్లు పలికెదవు !

రాజు. - బొబ్బిలిపురుగు మిగిలిన, నిన్ను నన్ను ఇఁక నుంచునా ?

బుస్సీ. - ఇంత ద్రోహము తలంచిన, నీ నెత్తిపైని దేవుఁడు పిడుగు వైచును జుమా. నౌకరులారా ! వీరిని గౌరవముగా విచారించుచు, సుఖముగా, మాడేరాలోనే, మాపడుకగదిలో నుంపుఁడు.

[నౌకరులతో వేంకటలక్ష్మి బాలుంగొని నిష్క్రమించును.]

ప్ర. - సర్దార్ ; యుద్ధం మాని పది తెల్లజెండాలు వేసుకొని సమీపించి రాయనింగారితో 'వీరాగ్రేసరా, మీతో బూసీదొరగారు సఖ్యం కోరుతూ వున్నారు. మీరు ప్రాణంతో వారి దగ్గరికి విజయం చేయవలెను.' అని కోరితే, ఆలాగే వస్తాము విజయరాముణ్ణి మాకాడికి దెస్తే, అందాకా పోరుతూనే వుంటాము; మీరు దోరుతూనే వుండండి.' అని మల్లీ మన దండును రూపుమాపుతూ వున్నారు.

బుస్సీ. - మరల పోయి ఆయనతో 'అయ్యా, మీకుమారుని బాలుని చినవేంకటరావును దాసివేంకటలక్ష్మి సామర్లకోటకు కొనిపోవుచు మాకు పట్టుఁబడినది. వారిని మేము కాచియున్నాము. బాలుని క్షేమముగా మీ కందించెదము, సఖ్యము చేసికొన దయ చేయవలయును.' అని వేడుకొని తెండు. [ప్ర. నిష్క్రమించును.]