పుట:Bobbili yuddam natakam.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాంకము.

స్థలకము: - బుస్సీ డేరా.

అంతట బుస్సీయు విజయరామరాజు ప్రభృతులును ప్రవేశింతురు.

[నేపథ్యమున మహాప్రకాశము కలుగును.]

బుస్సీ. - [సంభ్రమమున] రాజా, ఇదే మయ్యా, ఇంతవెల్తురు ?

[రాజును బుస్సీయు పరిక్రమించి పరికించినట్టు అభినయించి కూర్చుందురు.]

బుస్సీ. - ఏ మయ్యా ఆజ్వాల ? కోటయంతటను మంటికి మింటికి అంటి యున్నది.

రాజు. - దొరగారూ, ఈ వెలమవాని గర్వము మీ కేమి తెలియును ? బయట మనతో యుద్ధము, లోపల 50 పెండిండ్లు. ఈ జ్వాల యతని బాణసంచాలమంట.

బుస్సీ. - ఏమి యాశ్చర్యము ! ఏమి యాశ్చర్యము ! 50 పెండిండ్లు! ఇదే సమయమని తెచ్చితివయ్యా ముట్టడి ! ఆహా ! ఆహా !

ప్ర. - సర్దార్, రంగారావు 700 మంది సిబ్బందితో కోట నుంచి మీ డేరాల మీదికి దూకినాడు. దారిలో లాలు ఖుమందాను అడ్డినాడు. అక్కడ వారికి వీరికి లగాలగి మరామరి.

బుస్సీ. - లాలుతో చెప్పుము, రంగారావును ప్రాణముతో ఇక్కడికి తెమ్మని.

ప్ర. - సర్కా రాజ్ఞ. [అని నిష్క్రమించును.]

[అంతట హైదరుజంగు, వేంకటలక్ష్మిని చిన వేంకటరాయని జవానులచే పట్టించి తెప్పించి బుస్సీయెదుట నిలుపును.]

బుస్సీ. - ఎవ రయ్యా వీరు హైదరుసాహెబు ?

హైదరు. - అయ్యా, ఈ బచ్చాకి తీస్కొని ఈమన్సీ కోటకాడినుంచి యెల్తా వుంది. సోల్జర్లు అడ్డంవొస్తే, వరహాలు సల్లుతుంది. వాళ్లు వాట్కీ రాజాయిళాయి యెల్తుర్లో యేరుకొంటా వుంటే, ఇది తప్పించుకొని పారిపోతా వుంది. వరాలు గిరాలు చూచి బొబ్బిలి జమీన్దార్ ఇలాఖా బచ్చాకీ తల్చి, అవిదొరకనివాళ్లు మనసిపాయీలు యీళ్లకిని పట్టుకొని ఇక్కడికి తేబోతే, యిది బాకుకి దూసి లడాయి చేస్తుంది. 100 మందిని కుమ్మింది. చూడడానికి దాసీవుంది, సాముగరిడీలకీ బురాక్ వుంది. పిల్లవాడికి తుపాకి వాత వేస్తామంటే అప్పట్కి యిది మమ్మల్ని సంపడం మానింది. మీరు మాటలాడ వొచ్చును.