Jump to content

పుట:Bobbili yuddam natakam.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బొబ్బిలియుద్ధనాటకము. 80

               మిత్తి నైనఁ బోర మీకై పొడుచువారు,
               తొడుగు తొలఁచుకొఱకుఁ దొలఁగినారు. ౬౯

రంగ. - ఆహాహా ! ఏమి వారి యనురాగము ! ఏమి తెగువ ! నాకుం గూడ వారు మార్గ దర్శకు లైరే. నాకును స్వయముగా వదిలించుకోవలసిన తొడుగులు కలవు గదా ? అంత:పురము నగళ్లకే దారి చూపుము.

వెంకయ్య. - ఏలినవారు ఇటు రావలయును. [రంగ - వెంకయ్య - నిష్క్ర.]

స్థలకము. - అంత:పురము.

[పెండ్లికొమారితలు, మల్లమ్మ దేవిగారును ఉపవిష్టలై ప్రవేశింతురు పెండ్లికుమారులు సంభ్రమున ప్రవేశింతురు. పెండ్లికొమారితలు లేతురు.]

మల్లమ్మ. - ఏమి నాప్రాణములారా ! ఇట్లు మీ రొక్కుమ్మడి అంత:పురము ప్రవేశించిన కారణ మేమి ?

పెంద్లి కుమారులలో నొక్కఁడు - దేవిగారికి ! ఇవి మా కడపటి దండములు. వెంగళ్రాయనింగారు వీరస్వర్గమునకు వెళ్లినారు. రంగారాయనింగారు కోట వెలుపలకు రాజుతోను, పరాసులతోను, కలయబడుటకు తరలుచున్నారు. పరాసులు బొబ్బిలి కోటను కూల్చుచున్నారు మఱి మే మేలవచ్చితిమో తమకు చెప్పవలయునా ?

[వెంగళ్రాయని భార్య సుభద్రమ్మ శోకించును.]

రాణి. - అమ్మా, సుభద్రమ్మా, నాబంగారు చెల్లెలా, నీప్రాణేశ్వరుఁడు రవంత ముందు పోయినందులకు దు:ఖించెదవా ? ఈసమయములో మనకు దు:ఖము పనికిరాదు. నాకూనా, నాముద్దుఁగూతులారా ! మాప్రాణేశ్వరులతో మీప్రాణేశ్వరులు వీరస్వర్గమునకు తరలియున్నారు. మన మచటికి ముందుగాఁ బోయి వీరు విజయంచేయు సమయమునకు గృహాత్మాలంకారములు గావించుకొని వీరికి స్వాగతము సెప్పవలదా ? ఎవరి దొరను వారు, తొలిచూపే కడసారి చూపు చూచుకొని, తొలిదండమే కడసారి దండము పెట్టి, ముందుగా తరలుఁడు.

[పెండ్లి కొమారితలు భర్తలకు ప్రణమిల్లి లేచి వారిబాకులం గైకొందురు.]

[నేపథ్యమున]

'గోవింద గోవింద, నారాయణ, నారాయణ.' [అందఱు ఆకర్ణింతురు.]

రాణి. - ఆహా ! పెద్దవారు అందుఱు మనకన్న ముందుగానే తరలినారు ! వెనుకఁ బడుట మనకు అవమానము గాదా ? ఇదిగో నాకు నా ప్రాణేశ్వరులు ఇచ్చిన బా కున్నది. సుభద్రమ్మకు వెంగళ్రావు ఇచ్చి బోయిన బా కున్నది.