పుట:Bobbili yuddam natakam.pdf/88

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాంకము. 79

రంగ. - [ఱిచ్చవడియుండి] హాహాహాహా ! ఎపుడును నా యనుచరుండవుగా నుండువాఁడవు ; ఇప్పుడు నాకన్న ముందు నీవు ఎట్లు వీరస్వర్గమునకు వెళ్లితివయ్యా! హాహాహాహా ! నా యదృష్టము !

రంగ. - అన్నలారా, పడవాళ్లారా నాకుడిభుజము విఱిగిపోయినదే! ఇఁక నే మున్నది ! వెంగళ్రావు పోయిన పిమ్మట ఇంక నేమి బొబ్బిలి !

[ఫిరంగియగాదులు, నౌకరులు సంభ్రాంతులై ప్రవేశింతురు.]

నౌక. - మహాప్రభో, పరాసుల ఫిరంగిగుళ్లు వొచ్చి కోటలోనంతా పడతావున్నయి, లోగిళ్లు కూలిపోతావున్నయి. గుళ్ల దెబ్బలకి మన నౌభత్తువాళ్లు నాశమై పోయినారు. మనజెండా ఏమయిందో తెలవకుండా యెగిరిపోయినది.

[రంగారాయని మ్రోల దివాణములో ఫిరంగిగుండ్లు పడును.]

రంగ. - హాహా ! అయ్యా పెండ్లికుమారులారా, ఓబంధువులారా -

           సీ. పెండ్లికై విచ్చేయఁ బిలిచికొంటిని మిమ్ము ;
                   నిట నిట్టు లగు నని యెఱుఁగనైతి!
               దురమునకై మిమ్ముఁ దోడు వేడఁగలేదు,
                   దైవంబు మా కిప్డు దాయ యయ్యె.
               మముఁగూర్చియే కదా మలకలు వచ్చిరి,
                   వారికి మీమీద వైర మేమి ?
               దారికి సామగ్రి దయసేసి కైకొని
                   సకుటుంబముగ మీరు సాగిపొండు
          ఆ. 'పెండ్లికతమున మేము బొబ్బిలికి వచ్చి
                   యేఁగుచున్నార' మనినఁ, బోనిత్త్రు మిమ్ము.
               మిగిలియుండుఁడు నేమాన మీరలేని;
                   మాకొఱకు మీకు సంఘాతమరణ మేల ? ౬౮

[పెండ్లికుమారులు రాజబంధువులు అందఱు ఉగ్రవీక్షణులై నిష్క్రమింతురు.]

రంగ. - వెంకయ్యా, ఏమి ? వీరు బదులు చెప్పకయే లేచిపోయినారు ?

వెంకయ్య. - మహాప్రభూ, వారి గాంభీర్యము మీకు తెలిసినదే గదా ?

          ఆ. ప్రాణ మిచ్చునట్టి బంధులు గావునఁ,
               బ్రాణబంధుసంజ్ఞఁ బడసినారు ;