పుట:Bobbili yuddam natakam.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవేశకము. 63

పౌరులు. - ఇంకా శెప్పండయ్యా, శెప్పండి ; మనదొరలు పరాసులని యలాగ గెలుస్తారో ?

అప్ప. - వినండి మఱి. వెలమదొరలలోనే మఱి కొందఱు నరిసింహమూర్తి వంశస్తులు. అందుచేత వెలమదొరల ముందర, యీభూలోకంలో, మ రేవీరులున్ను తల యెత్తలేరు.

సన్నా. - ఓయి నీ తెలివీ ! సర్వజ్ఞ శింగమ నాయనింగారని మఱి నొక మూలపురుషుడు రా. ఆయనికి తెలియని శాస్త్రంగాని విద్యగాని లేనందున, ఆయనికి సర్వజ్ఞ బిరుదు వొచ్చింది. ఆయన వేంకటగిరి రాజధానిగా తూర్పుసీ మంతా యేలిన దొర.

అప్ప. - అన్నా ! సన్నాసిగాడు ! మాటమాటకీ పుల్లేస్తాడు !

[అని సన్నాసిని చిటమట లాడుచుం జూచును.

సన్నా. - ఏమిటీ ! అప్పిగాడు మనిషిలాగ రేగుతున్నాడు !

[అని కోపించును.

[అంతట వెట్టివాడు ప్రవేశించి యిట్లు దండో రా వేయును.]

అళివిగాని పెళయం వొచ్చింది. (డుండుం.) పరాసులు గడెకో గడెకో కోటమీది కొస్తారు. (డుండుం.) వూరిజన మంతా యెవరిసొత్తులు, పానాలు, వారిశాతనైనలాగ కాపాడుకోవలశింది. (డుండుం.) యీలా గని యేలినవోరు సాటించ మన్నారు. - (డుండుం.)

[అని నిష్క్రమించును.

పౌరులు. - [దిగులుతో] ఈసాటింపుకి గుండె నొటుక్కు మంటున్నది బాబో !

అప్ప. - నా కేమో భయంలేదు. నా కింకా 2000 బ్రాహ్మణార్థా లున్నాయని జోస్యుడు చెప్యాడు.

పౌరులు. - వవ్వా వవ్వా! మంచి జోశ్శమయ్యా. మాకంతా సావూ, పరాసు కూడూ, తప్పదు. ఏం శేతాం బాబూ ?

(అంతట కోమటి చెలువలు నీళ్ల బిందెలతో తిరిగి తిరిగి

వెనుకకు చూచుచు వడివడిగా నడచుచు ప్రవేశింతురు.)

సన్నా. - ఏ మమ్మా, కోమటక్క లంతా వడివడిగా గుంపుగా వొస్తున్నారు?

ఒకతె. - ఎందుకా అన్నా ? సిద్దీలు అక్క డక్కడ పొంచుండి ఆడవాళ్ల కేసి తప్పుడు చేష్టాలన్నీ చేస్తున్నా రన్నా.

[అని వడిగా పరిక్రమించును.

అప్ప. - నేను వెళ్తా; నా కీరోజు బ్రాహ్మణార్థం వుంది.

[అని నిష్క్ర.

సన్నా. - బలే తండిపోతు ! నేను రేపు వుంటానో వుండనో? అందుకోసం అరు వేడవడం యెందుకు? గోపాలస్వామిగుడి నంబ్యాచార్లు నాకు చక్కెర పొంగలీ దధ్యోధనమూ పెడతా నన్నాడు. వా ట్నెందుకు పోగొట్టు కోవడం ?