పుట:Bobbili yuddam natakam.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాంకము. 51

              బంటు గంటు తెలగాలము గామా ? యొంటర్లము గామా ?
              విలయము వచ్చిన సమయమునందు వెనుకకుఁ దగ్గుదుమా ?
              చచ్చిన పేరు, బ్రతికిన లేదు, సాహసాంక రంగ.
              మీ రణభేరి మ్రోఁగినప్పుడే మీకె యెఱుక గాదా ?
              గుభేల్ ! గు భేల్ ! గుభె ! లరులకు, మాకు
                      శుభము ! శుభము ! శుభము !
              ఫణులు ! ఫణులు ! ఫణు ! లరులకు, మాకు
                      మణులు ! మణులు ! మణులు !
              భయము ! భయము ! భయ ! మరులకు, మాకు
                      జయము ! జయము ! జయము !
              మీరు పోరను మేము నిలువను మీరు తలఁచినారా ?
              మీతోడిదె మాలోక మన్నది మీరు మఱచినారా ?
              అడ్డుమాటలు సెలవు లియ్యక యాదరించి మమ్ము,
              పనిగొనవయ్యా, పనిగొనవయ్యా, ప్రభువ రంగరాయా. ౫౭

[అని ప్రాంజలు లగుదురు.]

రంగ. - దళవాయులారా ! మీ యనురాగమునకు మిక్కిలి సంతోషము. అటయిన యుద్ధమునకు సన్నద్ధుల రగుఁడు. మహావీరులారా ! మీరు ఒక్కొక్కరును పగతురతో కలయఁబడుదు రేని నూర్లను వేలను రూపుమాపఁ గలవా రగుట లోకవిదితమే ! అయినను పరాసుమూఁక, అనంతముగా నున్నది. మీచేతులకు సయితము తఱుఁగునదిగా నగపడదు. సముద్రమునకు ఏతము వేయుటగా నున్నది. పైగా మనము ముఖ్యముగా ఊఁచతోను, ఈఁటెతోను, కూల్చువారము. వారు ముఖ్యముగా గుండుతోఁ గూల్తురు. మఱి వారి పాల నున్న నల్లమందు నూరమ్మతో పోరుట కష్టము. కోటకాపున, మాటుల నుండి మనము పోరితిమా, వారిగుండు మనపైఁ బాఱదు, మనయూఁచ వారినికూల్చును. నల్లమందు మారమ్మ మనమీఁదికి రాఁజాలదు. ఫిరంగులు మోర్జాచేసి కోటను గూల్పం గడంగుదురు. మీరు ఫిరంగివాని నెల్ల ఊఁచవాత వేయుదు రేని, వారి యాపని నెఱ వేఱదు. మనము బయటి కేఁగితిమా, వారు సులువుగా కోట పట్టుదురు. అనంతరము మనము రెండునిప్పులనడుమ మాడిపోవలసినదే. కోటలో నున్న ట్లయిన, నా నియమించు సేనావిన్యాసమును నెఱ వేర్పుఁడు. ఏమి ? నాయూహ సరిగా నున్నదా?