పుట:Bobbili yuddam natakam.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాంకము. 49

భాయి భాయిగా పోవచ్చును.' అని వక్కాణించెను. అంతట 'మీతో రాయబారము వలనఁ బ్రయోజనము లేదు.' అని నేను లేవఁగా, ఖానులు గీనులు, అందఱును, కనులెఱ్ఱఁ జేసికొని, కత్తి దూసికొని, 24 గురును నన్ను పొదివిరి. హైదరు నన్ను అడ్డగింపుఁడని పండ్రెండు పహరాలకును, పహరాలో పెట్టింపుఁ డని ఖానులకును, ఆజ్ఞచేసెను.

సభ్యులు. - ఏమి యాగడము !

రంగ. - అంత ?

ధర్మా. - అంత, 'నీపహరాలో నిలిచితినేని నేను వెలమబిడ్డనఁటరా?' అని కేక వేసి, -

[పంచచామరము]

              తటాలునన్ బటాలు దూసి తన్నుఁ గాచు సామునన్
              బటాన్ మొగల్ ఘటాఘటీలు భ్రాంతులై ననుం గనన్
              బటాలు ఱెక్క, లేఁ దిమిన్, సపత్న వార్ధి దూఁటి, బల్
              హుటాహుటిన్ హుమాపయిన్ దదుక్తిఁ జెప్ప వచ్చితిన్. ౫౨

నా పరిజనములును, బవ్వున ఈఁటెలు వంచి, అడ్డ మయిన సిపాయిమందల నెల్ల తెగఁబొడిచి, కూల్చుచు దారి చేసికొని, తమ పోటు రుచిచూచినవారు చూడని వారును, దిగులుపడి నిశ్చేష్టు లై పడుచు లేచుచు తమ్ముఁ గనుచునుండ, నావలెనే అక్షతశరీరులై నావెంటనే వచ్చియున్నారు. నేను జేసినపని తప్పో ఒప్పో తమరే ప్రమాణము.

రంగ. - ధర్మారాయఁడా ? మాపరువు నిలిపితివి. శత్రువులకు వెలమపోటు రుచి చూపించి, అక్షతశరీరుఁడ వై వచ్చి మాకు కనులపండువు గావించితిని. ఇంతకన్న ఒప్పేమి యుండును ? చాలును, అలసితివి. పోయి సేదదేఱుము.

ధర్మా. - మహాప్రసాదము.

[అని నిష్క్రమించును.]

రంగ. - [సభ్యుల నందఱ నుద్దేశించి] అయ్యా, ఇంక నే మున్నది ! పోరు పొసఁగినది.

           క. ఈసమయంబునఁ బాపయ
               మాసమ్ముఖమందు నున్న, మార్కండేయున్
               బాస టయి హరుడు గాచిన
               వాసిగ, మముఁ గావఁడే యవనయమువలనన్ ! ౫౩