పుట:Bobbili yuddam natakam.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

బొబ్బిలియుద్ధనాటకము.

వృద్ధులు అందఱు నీ పేరు పల్కు చు, అంగలార్చు చున్నారు. నీవు వచ్చిన, మాకు ఈ సంఘాతమరణము తప్పును. ఏడేడు పదునాలుగేండ్లకును బొబ్బిలికోటను ఆ యముఁడును పట్టలేఁడు; జయము కీర్తియు క్షేమమును కలుగును. నీవు రాకున్న, రాజామునకు తరలిననాఁటి చూపులే నీకును నాకును కడసారి చూపులు సుమా ! పెండ్లికి రా వైతి వని చింతిల్లుచుంటిని. ప్రాణము గావ రావేని చెప్పవలయునా? ఈజాబు చూచిన తత్క్షణము, బావా, రాజామునకు బొబ్బిలికి సందున విజయరామరాజు దండు విడిసి యున్నాఁడు, అతని దండును విఱుగఁబొడుచుకొని కోటకు రావయ్యా. ఇన్నూటి తో వెంగళరాయని నీకు ఎదురు పంపెదను. నీకోసము దిడ్డితలుపు తీసి యుంచెదము. నీవును మిరియాలసీతన్నయు, మాలపల్లిమీఁదుగా, కొండబోటు తిరిగి, ఆదారిలో హైదరుజంగుడేరా యున్నది, ఆహైదరుజంగును విడిదిలలో నఱకి, రావలయును. ఈరాత్రి వత్తువేని, నీకును నాకును చూపు లుండును. ఇవే బావా ; నాకడసారి దండములు.-

ధాతు - ఫాల్గున - శు. 3 సోమవారము.

రంగ. - దివ్యముగా వ్రాసితివి. మేమే చెప్పిన ఇంత చక్కఁగా కుదరదు. ఇదిగో మొహరు.

[అని యుంగరము తీసి రామయ్య చేతి కిచ్చును.

[రామయ్య మొహరు వేసి, మొహరు రంగారావుచేతి కందిచ్చును.

రంగ. - ఈజాబులు పగతురచేతఁ బడకుండ పాపయ్యకు ఎట్లు చేరఁగలవు?

రామయ్య. - మహాప్రభూ, నేను వెళ్లి ఆసంవిధానము చేసెదను.

రంగ. - మంచిది పోయి అట్లే చేయుము.

[రామయ్య నిష్క్రమించును.

ప్రతీహారి. - [ప్రవేశించి,] జయము జయము ఏలినవారికి ? మహాప్రభో, జోస్యుల వారు కాశీకి వెళ్లినారు ; వారి సిషువుడు ఏలినవారి సభకు రాను భయపడి [అని వ్ఁరాతయొకటి రంగారాయని మ్రోల నిడి,] ఈరాత తన గురువుగారు ప్రశ్నవస్తే యేలినవారికి అందించమని తనచేతి కిచ్చి వెళ్లినా రని యిచ్చినాడు.

రంగ. - [కైకొని, ఇట్లు చదువుకొనును.]

       *[1]మ. అమృతాహారులసంగడి న్వలచి కాయంబూడ్చి స్వర్వాటికిన్
              గమనించున్ సకళత్రబంధుసచివాక్రందప్రయోధంబుగా
              సమదారాతి చమూ మహోదధి నగస్త్యక్రీడఁబెంపొంది రం
              గమహీనాథుఁడు ధాతుఫాల్గునవలక్షన్ దుర్యవేఁబ్రొద్దునన్. ౫౦

  1. * ఈపద్యము మదీయము. ఏతత్ స్థానమున ప్రథమముద్రణమందుండినట్టిది, మదీయము గాదు. వే. వేం.