పుట:Bobbili yuddam natakam.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాంకము. 43

సమసిన, నిఁక భూమిలో మన పే రెక్కడిది ? కనుక నీవు మనస్త్రీలను పరాసుల చేఁతబడి యవమానపడకుండ, వలస తీసికొని పాలకొండ మన్నెమున కేఁగుము.

[వెంగళ్రావు భ్రాంతుడై దిగులుపడి రంగారాయని చూచును.]

రంగ. - ఏమి లేవవు? ఎప్పుడును నా నోటిలోని మాట నా నోట నుండఁ గానే పని నెఱవేర్చువాఁడవు. ఇంతవరకు యుద్ధములో నెప్పుడును ముందుమొన నడపించినవాఁడవు. ఇపుడు వెనుకకు పంపినందులకు నాపై కోపమా ? సమయమట్టిదిగా నున్నది? ఈజన్మములో నంత ఈదినమున ఉందుమో ఉండమో ? ఇట్టి సమయములో నాయాజ్ఞ నెఱవేర్ప త్వరపడ వేమి ?

వెంగ. - హా ! కొజ్జాలు చేయవలసినపనియా నాకు సంభవించినది ! ఏమి యీ దైవవిలాసము !

రంగ. - హా ! ఎట్టికాలము వచ్చినది !

వెంగ. - అన్నయ్యగారూ, రాణివాసములను తరల్చి మరలి తమ దర్శనము చేసి కొనియెద. వారితో వేఱొకరిం బంపవలయును.

[అని నిష్క్రమించును.]

రామయ్య. - [ప్రవేశించి] ఇదిగో జాబు ; రెండు నకళ్లు వ్రాసి తెచ్చితిని.

రంగ. - చదువు రామయ్యా చదువు.

రామయ్య. - [చదువును]

"స్వస్తి శ్రీ బొబ్బిలి నేలు రావు గోపాలకృష్ణ రంగారావు బహద్దరువారు, మా బావగారికి, తాండ్ర పాపారాయనివారికి, కడపటి దండములు మ్రొక్కివ్రాయుట. - విజయరామరాజు రాజాము సీమలో పితూరీలు చేయించుట మిమ్ము వెంగళరాయని పెండ్లికి రానీయకుండుటకోస మని మోసపోయితిమి. అందులకు కానే కాదయ్యా. బొబ్బిలిని ఱెక్కలులేని పిట్టను జేసి చిదుగఁగొట్టుటకు, అని యెఱుఁగమైతిమి. ఇప్పుడు తెలిసినది. మఱే మున్నది బావా ! రాజు మనయింటిమీఁదికి గోలకొండ పరాసు పౌఁజును ముట్టడి దెచ్చినాఁడు. రెండు లక్షలకు కాకిమూఁక పరాసుమూఁక కమ్ముకొని యున్నది. రాత్రి దొంగప్రొద్దున దొంగతనముగా ముట్టడివేసినారు. వేగుప్రొద్దునఫిరంగి వేట్లు వేసి తెలిపినారు. గడియకో అఱగడియకో ఫిరంగివాతను బొబ్బిలిని వేసికొందురు. మేము పాపకారి పెండిండ్లు చేసితిమి. కోటలోపల చుట్టాలు వచ్చి నిండియున్నారు. స్త్రీలను కోటలో నుంచి, జగడ మాడుట సరిగాదు. మాకు కోటలోపల రస్తు లేదు. వలసలు తరలుటకు త్రోవలు లేవు. బావా, వెంగళ్రాయఁడు ఇంకను, కంకణాల చేతులతోనే యున్నాఁడు. మా కందఱకు సంఘాతమరణము సిద్ధమైన దయ్యా. పెద్దలనాఁటి బొబ్బిలికోటకు మాకు ఋణము చెల్లినది. ఇక్కడ స్త్రీలు, పురుషులు, బాలురు,